Friday, May 17, 2024

గోదావరికి భారీగా వరద.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 9.70 అడుగులకు చేరిన నీటిమట్టం..

రాజమహేంద్రవరం, ప్రభన్యూస్‌ : గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజ్‌ వద్దకు వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి బ్యారేజ్‌ వద్ద గోదావరి నీటిమట్టం 9.70అడుగులకు చేరుకుంది. దీంతో మొత్తం 175గేట్లను 0.2మీటర్ల మేరకు పైకెత్తారు. బ్యారేజ్‌ నుంచి 1.20లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రాత్రి 8గంటల సమయానికి బ్యారేజ్‌ వద్ద 2.9243టిఎమ్‌సిల నీటి నిల్వ నమోదైంది. ఆ సమయానికి కాటన్‌ బ్యారేజ్‌ వద్ద రిజర్వాయర్‌లో నీటిమట్టం 13.63అడుగులుగా ఉంది. శనివారం ఉదయంనుంచే కూనవరం సమీపంలో గోదావరి నీటిమట్టం పెరగడం మొదలైంది. ఈ ప్రభావం శనివారం సాయంత్రానికే కాటన్‌బ్యారేజ్‌ వద్ద కనిపించింది. వరద కారణంగా గోదావరి నీరు ఎర్రబారింది. ఎగువ నుంచి మరిం తగావరదనీరొచ్చే అవకాశం స్పష్టమౌతోంది. దీంతో ధవళేశ్వరం ఆర్మ్‌లోని 69, ర్యాలీ ఆర్మ్‌లోని 43, మద్దూరు ఆర్మ్‌లోని 18, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని 39మొత్తం 175గేట్లను ఎత్తడంతో పైనుంచొస్తున్న నీరు యదావిధిగా సముద్రంలోకి విడుదలౌతోంది. కాగా శనివారం రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 20.20అడుగులుగా నమోదైంది. అలాగే కాళేశ్వరం వద్ద 6.700మీటర్లు, పేరూరు వద్ద 6.950మీటర్లు, దమ్ముగూడెం వద్ద 7.230మీటర్లు, కుంట వద్ద 4.230మీటర్లు, కొయిదా 7.390మీటర్లు, పోలవరం వద్ద 7.160మీటర్లు, రాజమండ్రి రైల్వే వంతెన వద్ద 13.570మీటర్ల నీటిమట్టం నమోదైంది. రానున్న వారం రోజుల్లో ఈ నీటిమట్టాలు మరింతగా పెరుగుతాయని జల వనరుల శాఖాధికారులు అంచనాలేస్తున్నారు. ఇందుకనుగుణంగా గోదావరి గట్ల వెంబడిప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్లడ్‌ క న్జర్వేటర్‌ కార్యాలయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కోనసీమలో తెగిన తాత్కాలిక గట్టు

వరదనీటి ఉధృతికి కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామం వద్ద తాత్కాలిక నదీపాయ గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెల వారి పాలెం, పెదలంక గ్రామాలకు ఇతర ప్రాంతాల్తో సంబంధాలు తెగిపోయాయి. వరదలు తగ్గిన తర్వాత తిరిగి నదీపాయ గట్టు నిర్మించే వరకు ఈ గ్రామాల ప్రజల రాకపోకలన్నీ ఇక పడవలపైనే సాగాలి. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు అధికారులు గోదావరి గట్ల పటిష్టతపై ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. హడావిడిగా జూన్‌ 1వ తేదీన కాలువలకు నీరివ్వాలన్న తాపత్రయాన్ని ప్రదర్శించారు. కాలువల మూసివేత సమయంలో గట్ల ఆధునీకరణపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. ఈ కారణంగానే ఇప్పుడు నదీపాయ గట్టు తెగిపోయింది. కనీసం వరదల ప్రభావంపై కూడా అధికారులు సమీక్షలు జరపకపోవడంతో వచ్చే వారం రోజుల్లో ఈ జిల్లా పరిధిలోని మరికొన్ని గట్లు తెగిపోయే ప్రమాదాన్ని రైతు సంఘాలు అంచనాలేస్తున్నాయి. కనకాయలంక, అయినవిల్లి, ఎదురుబిడియం కాజ్‌వేలపైకి కూడా శనివారం రాత్రికి వరదనీరు చేరింది. ఆదివారానికిది పెరిగితే ఈ గ్రామాలక్కూడా రాకపోకలు నిల్చిపోతాయి. అలాగే యానాం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు ప్రవేశించింది. దీంతో పుదుచ్ఛేరి ప్రభుత్వం ఇక్కడ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. మరోవైపు ముంపు మండలాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపనదుల మీదుగా ఈ వర్షపు నీరు వరదలా వచ్చి గోదావరిలోకొచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు..

భారీ వర్షాల కారణంగా వరదలొచ్చే అవకాశం స్పష్టం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వీటినిపర్యవేక్షిస్తున్నారు. కాకినాడ, అమలాపురంలతో పాటు ధవళేశ్వరం వద్ద కూడా కంట్రోల్‌ రూమ్‌ నెలకొల్పారు. ఎప్పటికప్పుడు అధికారులు వరద పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనల్ని క్రింది ఉద్యోగులకు, సిబ్బందికి అందిస్తున్నారు. అలాగే భారీ వర్షాలు లేదా వరదలు ముంచెత్తుతున్న సందర్భాల్లో కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయాల్సిందిగా అధికారులు సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement