Saturday, May 4, 2024

నీట మునిగిన సగం పంట.. కూరగాయల ధరలపై వర్షం ఎఫెక్ట్

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ : హైదరాబాద్‌ మహా నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్నం టుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ప్రతి రోజు ఉపయోగించుకునే నిత్యావసర వస్తువులైన కూరగాయలపై పడింది. ఎడతెరిపి లేని వర్షాలతో కూరగాయ పంట పోలాలు నీట మునిగి పోవడం, ఉన్న వాటిని కూడా హైదరాబాద్‌కు చేర్చలేని పరిస్థితుల్లో నగరంలోని ప్రధాన మార్కేట్లతో పాటు రైతు బజార్లు కూడా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. దీనితో నగరంలో కూరగాయలు కొనలేని పరిస్థితి వచ్చింది. నగర వాసులకు సరిపడే కూరగాయలు లభించక కష్టంగా మారింది. నగరంలో ఉన్న మూడు హోల్‌సెల్‌ మార్కేట్లు, 11 రైతు బజార్లతో పాటు సూపర్‌ మార్కేట్లలో, కాలనీలలో ఉండే చిన్న చిన్న సంతలలో కూరగాయల దర్శనం కష్టమైంది.
ఆహారం అవసరం. అలాంటి ఆహారం సామాన్యు డికి అందుబాటులో లేకుండా పోతుంది. మండిపో తున్న కూరగాయల ధరలతో సామాన్యులు కొనడమే కష్టమవుతున్నది. కోడిగుడ్డు ధర కూడా కొండెక్కింది. తీవ్రమైన వర్షాలతో దిగుబడి లేక పెరిగిపోతున్న కూరగాయల ధరలను చూసి జనం బెంబేలెత్తుతు న్నారు. మరికొంత కాలం వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే మధ్య తరగతి, పేద వర్గాలకు అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న ధరలు రెక్కాడితే డొక్కాడని రోజు వారీ కూలీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పండించిన పంట హైదరాబాద్‌కు చేరక పోవడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారుతుంది. నిరంతరం కురుస్తున్న వర్షాలతో రైతు బజార్లకు కూడా రైతులు నేరుగా రాలేక పోతున్నారు.

కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్‌ నగర వాసులకు రోజుకు కనీసం 300 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం ఉంటుంది. అయితే డిమాండ్‌కు సరిపడ కూరగాయలు రాక పోవడంతో దళారులు తమ వద్ద ఉన్న కూరగాయాల ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఉన్న కోటి మంది జనాభాకు ప్రతి రోజు వందల లారీల కూరగాయలు వస్తుంటాయి. దూర ప్రాంతాల నుంచిలారీలలోనే కాకుండా హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, సిద్దిపేట , వికారాబాద్‌, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి టాటా ఏసీలు, మినీ లారీలు,డీసీఎంలలో కూరగాయలు మార్కేట్‌కు తరలి వస్తాయి. ప్రధానంగా కూరగాయలు నగరంలో పెద్ద మార్కేట్‌ బొయిన్‌పల్లి కి వస్తాయి. అక్కడికి రైతులు కూరగాయలను తీసుకుని వస్తే అక్కడ ఉన్న కమీషన్‌ ఏజెంట్లు వారి ఇష్టానుసారంగా వ్యవహారించి వారు చెప్పిన ధరకే కూరగాయలను ఇచ్చివెళ్ళాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తప్పనిపరిస్థితిలో తెచ్చిన కూరగాయలను కమీషన్‌ ఏజెంట్లకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. బోయిన్‌పల్లి మాత్రమే కాకుండా ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్‌, మెహిదీపట్టణం, పటాన్‌చెరువు వంటి మార్కేట్లకు రైతులు కూరగాయలు తీసుకుని వస్తారు. నగర సమీపంలోని జిల్లాల నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ లలో కూడా వర్షాల ప్రభావంతో పంటలు బాగా దెబ్బ తిన్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక పోవడంతో మధ్య దళారులు కూరగాయల ధరలను అమాంతం పెంచిసొమ్ము చేసుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏ మార్కేట్‌కు వెళ్ళినా ఒక్క టామాట మినహా మిగిలిన అన్ని కూరగాయలు కిలో ఒకంటికి కనీస ధర 60 రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్ని కూరగాయల ధరలైతే 80 రూపాయలు పలుకుతున్నాయి. వంద రూపాయల నోటు తీసుకుని మార్కేట్‌కు వెళితే రెండు నుంచి మూడు రకాల కూరగాయలు మాత్రమే వస్తున్నాయని వి నియోగదారులు తెలుపుతున్నారు.

కూరగాయలు కిలో ఒకంటికి ధర రూపాయలలో
టామాట- రూ.30
పాలకూర- రూ.20 మూడు కట్టలు
వంకాయ- రూ.60
బెండకాయ- రూ.80
కాకర- రూ.60
చిక్కుడు- రూ.80
పచ్చి మిర్చి- రూ.60
ఆలుగడ్డ- రూ.50
క్యారేట్‌- రూ.60
కోతిమీర,పూదినా చిన్న కట్టలు- రూ.5
కీర దోస- రూ. 50
రూపాయలు- రూ.50
క్యాప్సికమ్‌- రూ.60
బీరకాయ- రూ.60
దొండకాయ- రూ.60

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement