Monday, May 6, 2024

సివిల్స్‌ రేంజ్‌లో గ్రూప్‌-1 పేపర్‌!.. పేపర్‌ చాలా టఫ్‌ వచ్చిందన్న అభ్యర్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అయితే పేపర్‌ చాలా కఠినంగా వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరైనట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. 503 పోస్టులకుగాను దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,082 మంది అభ్యర్థుల్లో పరీక్షకు హాజరైంది 2,86,051 (75 శాతం) మందికాగా, 94,031 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అత్యధికంగా 85.60 శాతం మంది అభ్యర్థులు నారాయణపేట జిల్లాలో హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

చాలా కఠినంగా పేపర్‌…

- Advertisement -

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ చాలా టఫ్‌గా వచ్చినట్లు కోచింగ్‌ సంస్థ నిర్వాహకులు, పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. సివిల్స్‌ పరీక్ష స్థాయిలో పేపర్‌ కఠినంగా వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-1కు ప్రిపేర్‌ అయ్యేవారు ఈ పేపర్‌ రాయడం కష్టమని, సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులైతే ఈ పేపర్‌ను సులువుగా రాస్తారని అభ్యర్థులు పేర్కొన్నారు. చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు, అసాధారణ రీతిలో ప్రశ్నలను ఇవ్వడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడినట్లు చెబుతున్నారు. దాదాపు 50కు పైగా ప్రశ్నలు ఇలా ఉండడంతో చాలా మంది పేపర్‌ను పూర్తి చేయలేకపోయారని తెలుస్తోంది. ప్రశ్నలను చదివి వాటికి సామాధానాన్ని ఆలోచించడానికే సమయం పట్టిందన్నారు. సగటున ప్రతి విద్యార్థి సమయం సరిపోక దాదాపు 15 ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే వదిలేసి వచ్చారని కోచింగ్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో కటాఫ్‌ మార్కులు సైతం 70 నుంచి 80 వరకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు ప్రశ్నలు సైన్సెస్‌, సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌, మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచే వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దాదాపు 45 శాతం ప్రశ్నలు వీటి నుంచే అడిగారు.

మొరాయించిన బయోమెట్రిక్‌ ట్యాబ్‌లు…

టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు హడావుడి పడ్డారు. కొన్ని సెంటర్లలో బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవడంతో అలస్యమైంది. దాంతో చాలా సేపటి వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. ఒక్కో అభ్యర్థి ఏడు ఎనిమిది సార్లు అటెండెన్స్‌ వేసినా ట్యాబ్‌ తీసుకోకపోవడంతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ట్యాబ్‌లలో చార్జీంగ్‌ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో కాస్త లేట్‌ అయ్యినట్లు తెలుస్తోంది. ఒకవైపు పరీక్షకు సమయం దగ్గరపడుతుండటం మరోవైపు థంబ్‌ అటెండెన్స్‌లో ఇబ్బందులు ఎదురవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ట్యాబ్‌లలో ఇబ్బందులు తలెత్తడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్‌లో వేచి చూశారు. 10.15 గంటల లోపు సెంటర్‌లోకి వెళ్లిన వారిని అనుమతించారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షకు అభ్యర్థులవద్దకు సిబ్బంది వచ్చి వేలిముద్రలు తీసుకున్నారు. కానీ గ్రూప్‌-1 పరీక్షకు మాత్రం అభ్యర్థులను లైన్‌లో ఉంచి వేలి ముద్రలు తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

అతి చేసిన అధికారులు…

కొన్ని సెంటర్లలో అధికారులు అతిగా ప్రవర్తించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని ఒక కేంద్రంలో అధికారులు అతి చేసినట్లు ఓ అభ్యర్థి తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు షూ లేకుండా హాజరుకావాలని సూచిస్తే…అక్కడి అధికారులు మాత్రం చెప్పులతో కూడా లోనికి అనుమతించలేదన్నారు. స్లిప్పర్స్‌ ఉంటేనే అనుమతించారు. దీంతో అభ్యర్థులు చెప్పుల్లేకుండా ఖాళీ కాళ్లతోనే పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసొచ్చారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.

45 రోజుల పసిపాపతో పరీక్షకు…

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 పరీక్షకు హుస్నాబాద్‌కు చెందిన ఓ మహిళ 45 రోజుల పసిపాపతో పరీక్ష రాసేందుకు వచ్చింది. వరంగల్‌ ఏఎన్‌ఎం కాలేజీలో తనకు సెంటర్‌ పడింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 పరీక్ష ఉండడంతో అటు కన్న ప్రేమ…ఇటు భవిష్యత్తుపై ఆలోచనతో పరీక్ష రాసేందుకు పసిపాపతో ఆమె వచ్చింది. ఆమె భర్త ఆ పసిపాపను పట్టుకొని ఆడిస్తున్న క్రమంలో పాల కోసం ఏడుస్తున్న పాపకు పాలు పట్టిస్తామని తల్లి వద్దకు పంపాలని ఆయన అధికారులకు కోరారు. అయితే రూల్స్‌ మేరకు పంపడం కుదరదని చెప్పడంతో గత్యంతరం లేక పాప తండ్రి డబ్బా పాలు పడుతూ పాపను ఆడించారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఇలాంటి ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. తల్లులు పరీక్ష రాసేందుకు లోపలికి వెళితే వారి పిల్లలను నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, తండ్రులు ఆడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement