Saturday, May 4, 2024

రైల్వే జోన్ భవనాలకు నిధులు మంజూరు.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నపై రైల్వే శాఖ జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం కేంద్రంగా మంజూరైన ‘సౌత్ కోస్ట్ రైల్వే’ జోన్ కోసం ప్రధాన కార్యాలయం, సిబ్బంది నివాస గృహాలు తదితర భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్ భవనాల నిర్మాణం కోసం తగిన స్థలాన్ని ఇప్పటికే గుర్తించినట్టు తెలిపారు.

జోన్ హెడ్‌క్వార్టర్స్ భవనాల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లతోపాటు ల్యాండ్ సర్వే, నివాస గృహాల సముదాయం వంటి పనుల కోసం ఈ ఏడాది నవంబర్ 10న రూ. 106.89 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధమైందని ఆయన తెలిపారు. ఈ రెండు అంశాలపై టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కమిటీ ఏర్పాటైందని, డీపీఆర్ ఆమోదించిన తర్వాత సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు తదితర పాలనాపరమైన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement