Sunday, June 23, 2024

ఆగని అబార్షన్లు.. ప్రభుత్వం ఆదేశాలు బేఖాతర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం ఆదేశాలు బేఖాతర్‌ అవుతున్నాయి. కడుపులో ఉన్నది ఆడ శిశువో, మగ శిశువో తెలుసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం స్కానింగ్‌ నిషేధించినప్పటికీ జిల్లాలలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నిఘా లోపం కారణంగా తరచూ శిశువులను గర్భస్థ దశలోనే విగత జీవులుగా మారుస్తున్న సంఘటలను వెలుగు చూస్తున్నాయి. కడుపులో పెరుగుతున్నది ఆడ పిల్ల అని తెలిసీ కనికరం లేని తల్లిదండ్రులు అబార్షన్లకు సిద్ధమవుతున్నారు. ఈ తతంగమంతా ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతుండం గమనార్హం. గత నెలలో మహబూబ్‌నగర్‌, యాదాద్రి భువనగిరి, తాజాగా సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన సంఘటనలు అభివృద్ధి చెందిన ఆధునిక సమాజంలో ఇంకా భ్రూణ హత్యలు జరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సూర్యాపేటలో ఒక్క రోజే ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో ఇద్దరు మహిళలు అబార్షన్లు చేయించుకోవడం తెలిసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు.

- Advertisement -

ఈ విషయం బయటపడటంతో డీఎంహెచ్‌వో సంబంధిత హాస్పిటల్‌ను సీజ్‌ను చేసి విచారణ జరిపినప్పటికీ ఆ మహిళలకు అబార్షన్‌ చేసిన వైద్యులు ఎవరనేది బహిర్గతం కాకపోవడం విశేషం. ఇదిలా ఉండగా, ప్రైవేటు హాస్పిటళ్లలో గర్భస్థ శిశువు ఆడనా, లేక మగనా అనే విషయం తెలుసుకోవడానికి జరుగుతున్న స్కానింగ్‌లు, ఒకవేళ ఆడ శిశువైతే అబార్షన్లకు దారితీస్తున్న ఘటనలకు పలు జిల్లాలలో వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కింది స్థాయి అధికారులే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హాస్పిటళ్లపై ఎప్పటికప్పుడు దాడులు జరపాల్సి ఉండగా, ఎప్పుడో అబార్షన్ల విషయం బయటపడ్డప్పుడు మాత్రమే నామమాత్రంగా దాడులు జరిపి ఆ తరువాత వదిలిపెట్టడంతో పరిస్థితి షరా మామూలుగా తయారైంది. అబార్షన్ల ఘటనలు బయటపడిన సందర్భాలలో సంబంధిత ప్రైవేట్‌ హాస్పిటల్‌ను సీజ్‌ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేయాల్సి ఉంటుంది.

పోలీస్‌ కేసులు కూడా నమోదు చేయాల్సి ఉండగా, ఆ విషయంపై జిల్లా స్థాయి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఎలాగోలా పైరవీలు చేసుకుని తిరిగి యధావిధిగా ప్రైవేటు హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారు. మరోవైపు, భ్రూణ హత్యలకు తల్లిదండ్రులే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తమకు పుట్టేది ఆడ శిశువా, లేక మగ శిశువా అని పరీక్షలు చేయాలని స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారనీ, దీంతో ఏం చేయలేని స్థితిలో డబ్బుల ఆశతో స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు వారు చెప్పినట్లుగా స్కానింగ్‌ చేస్తుండటంతో ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించి అబార్షన్లు చేయించుకుంటున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తరచూ వెలుగు చూస్తున్న అబార్షన్ల ఘటనలపై దృష్టి సారించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement