Saturday, April 20, 2024

ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి.. దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలి..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ సవరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని, ఆ అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తే 24 గంటల్లో ఈ అంశాన్ని పరిష్కరించుకుంటామని టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు తేల్చి చెప్పారు. గురువారం ఉభయసభలను వాకౌట్‌ చేసిన అనంతరం ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు న్యూఢిల్లిలోని తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. అంతకు ముందు యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ అగ్రనేతలు లేఖలు కూడా రాశారని చెప్పారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన ఆధారంగా వారికి న్యాయం జరగాలని నామా ఆకాంక్షించారు. అధికారం, పెత్తనం కేంద్రం దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని ఆయన హితవు పలికారు. అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్సీలు నిలదీయాల్సిన అవసరం ఉందని నామా పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, మీకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని నామా నాగేశ్వరరావు సవాల్‌ విసిరారు.

దళితుల్లో అసమానతలను తొలగించాలి: ఎంపీ రాములు..

షెడ్యూల్డ్‌ కులాల్లో ఒక వర్గమే ప్రయోజనం పొందిందని, మిగతా కులాలకు ప్రయోజనాలు దక్కలేదని ఎంపీ రాములు చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల్లో అందరికీ సమన్యాయం జరగాలని నొక్కి చెప్పారు. సంఖ్యాపరంగా మాల, మాదిగ వర్గాలు ఎక్కువగా ఉన్నాయని, షెడ్యూల్డ్‌ కులాల్లో అసమానతలను తొలగించడం కోసం రామచంద్రరావు కమిషన్‌ ఏర్పాటైందని ఆయన వివరించారు. 15శాతం ఉన్న ఎస్సీ కోటాను ఏబీసీడీగా వర్గీకరిస్తూ 1, 7, 6, 1 శాతంగా కేటాయింపులు జరిపిందని, వర్గీకరణ కోసం ఆర్టికల్‌ 341ను సవరణ చేయాల్సి ఉంటుందని రాములు సూచించారు. అసెంబ్లి తీర్మానం మాత్రమే కాదు, వర్గీకరణ చేయాలంటూ తెలంగాణ సీఎం రెండు సార్లు ప్రధానికి లేఖ కూడా రాశారని ఆయన తెలిపారు. కాశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని సవరించిన కేంద్రం, ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని దళితులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి దళితుల్లో అసమానతలను తొలగించే చర్యలు చేపట్టాలని, ఆ మేరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

జాతీయ పార్టీల ఎంపీలను నిలదీయాలి: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి..

ఎస్సీ వర్గీకరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసినప్పుడు కిషన్‌రెడ్డి అసెంబ్లిdలోనే ఉన్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. రెండు జాతీయ పార్టీలకు చెందిన ఏడుగురు ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారని, వీరందరినీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ప్రజలకు సూచించారు. బీజేపీ నేతలు స్థాయిని మించి మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌ బీజేపీకి బీ టీమా? సీ టీమా?: ఎంపీ రంజిత్‌రెడ్డి..

నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ చరిత్ర చెబుతున్నారని ఎంపీ రంజిత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క వర్గాన్నైనా ఆ పార్టీ అభివృద్ధి చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ 60 ఏళ్లలో చేయలేని పనిని కేసీఆర్‌ ఆరేళ్లలో చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం విషయంలో కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడదన్న ఆయన, ఆ పార్టీ బీజేపీకి బీ టీమా? సీ టీమా? అనేది తేల్చాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందరం కలిసి మాట్లాడుకుని వారికి కాపాడుకుందామని రంజిత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కలిసికట్టుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుందామనే జ్ఞానం కాంగ్రెస్‌కు ఉంటే బావుంటుందన్నారు.

ఓకే అంటున్నారే గానీ చర్యలు శూన్యం: ఎంపీ కేకే..

చారిత్రాత్మక కారణాల వల్ల ఎస్సీల్లో మాలలు ముందంజలో ఉన్నారని, పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలు సహా అనేక ఎస్సీ కులాలకు ప్రయోజనాలు అందడంలేదని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. అందుకే ఏబీసీడీ వర్గీకరణ చేసి సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. రామచంద్రరావు కమిషన్‌, ఉషా మెహ్రా కమిషన్‌ ఈ అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చాయని, బీసీల్లో జరిగినట్టుగా ఎస్సీల్లో వర్గీకరణ జరిగితే న్యాయం చేసిన వాళ్లమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఏది అడిగినా ఓకే అంటున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్య ఏదైనా మనందరిదీ అనుకుంటే అది ఉద్యమంగా మారుతుందని కేకే స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement