Thursday, April 25, 2024

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చండి.. ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీల వాయిదా తీర్మానం

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణపై ఎన్నిసార్లు తెలంగాణా ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేతలు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చాలంటూ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు గురువారం లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణతో చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లాకు నామా వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లి పంపించిన ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రి జోతిరాదిత్య సింథియా మాట్లాడుతున్న సమయంలో ఆయన ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే ఈ అంశంపై ఉభయసభల్లో చర్చించాలని ఎంపీలు కోరారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ఓంబిర్లా తిరస్కరించడంతో నిరసనగా ఎంపీలు వాకౌట్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని వారు కేంద్రానికి గుర్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement