Friday, May 17, 2024

పీజీ కోర్సుల్లో అమ్మాయిలే టాప్‌.. తొలివిడత సీట్ల కేటాయింపులో 73 శాతం వారికే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. ఒకప్పుడు టెన్త్‌, ఇంటర్‌ వరకే పరిమితమైన వారి చదువు…ఇప్పుడు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌కు చేరుకుంటోంది. ఉన్నత విద్యలో ఒకప్పుడు అమ్మాయిల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా అబ్బాయిల కంటే వారే ముందు వరుసలో ఉంటున్నారు.

మరీ ముఖ్యంగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో వారే టాప్‌ ప్లేస్‌లో ఉంటున్నారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) తొలివిడత సీట్ల కేటాయింపును అధికారులు ఈనెల 29న పూర్తి చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో విద్యార్థులకు అధికారులు సీట్లు కేటాయించారు.

- Advertisement -

సీట్ల కోసం మొత్తం 30,176 వేల మంది కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోగా వారిలో 22,599 మందికి సీట్లు కేటాయించారు. అయితే ఈ 22,599 మందిలో 16,496 మంది అమ్మాయిలే ఉండడం విశేషం. అంటే ఏకంగా 73 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. అబ్బాయిలు కేవలం 6,103 సీట్లు మాత్రమే పొందడం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది కూడా ఇంతే సంఖ్యలో సీట్లున్నా..చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. అయితే గతేడాదిలోనూ 16,163(71 శాతం) మంది అమ్మాయిలు పీజీ కోర్సుల్లో చేరగా, అబ్బాయిలు 6649 (29 శాతం) మంది మాత్రమే చేరారు.

పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఈఏడాది నిర్వహించిన సీపీగెట్‌ పరీక్షలో 40,230 మంది మహిళలు పరీక్షలు రాయగా, 19,435 మంది పురుషులు రాశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో మహిళలు 37,567 మంది ఉండగా, పురుషులు మాత్రం 18,172 మంది మాత్రమే ఉండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement