Thursday, April 25, 2024

గాలికి సుప్రీంలో ఎదురుగాలి.. గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్న గాలి జనార్థన్ రెడ్డికి బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటకలో కొత్తగా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బరిలో దిగిన గాలి జనార్థన్ రెడ్డి తన సొంత జిల్లా బళ్ళారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వీలుగా బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఇదివరకే విచారణ చేపట్టి వాదనలు ముగించగా, బుధవారం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది. బెయిల్ షరతులు సడలించడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించాలని గాలి తరఫు న్యాయవాది మీనాక్షి అరోరా ధర్మాసనాన్ని కోరారు. ఈ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో సాగించిన మైనింగ్ కార్యాకలాపాల్లో వందల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ, ఈడీ సంస్థలు కేసులు నమోదు చేసి చార్జిషీట్లు కూడా దాఖలు చేశాయి. తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డికి చాలాకాలం పాటు న్యాయస్థానాలు బెయిల్ కూడా మంజూరు చేయలేదు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా, వాటిని సడలించాలని కోరుతూ పలుమార్లు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. షరతుల్లో భాగంగా ఆయన బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి వీల్లేదు. బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోనూ పర్యటించడానికి వీల్లేదని బెయిల్ షరతులున్నాయి.

కేసులో సాక్షులను బెదిరించడం, ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా న్యాయస్థానం ఈ నిబంధనలు విధించింది. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ నెలలో తన కూతురుకు పాప పుట్టిందని, మనవరాలిని చూసేందుకు వీలు కల్పిస్తూ బళ్లారి వెళ్లడానికి అనుమతించాలని సుప్రీంకోర్టును కోరగా, నెల రోజుల పాటు బళ్లారిలో ఉండేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను బెదిరించడం, కేసు విచారణకు ఆటంకం కల్గించే పనులేవీ చేయవద్దని గట్టిగా హెచ్చరించింది.

తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి బయటికొచ్చి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన గాలి జనార్థన్ రెడ్డి కొప్పల్ జిల్లా గంగావతి నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు జతచేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదై, విచారణ జరుగుతున్న కేసులన్నింటినీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement