Friday, May 3, 2024

Delhi | శ్రీవారికి గజవాహన సేవ.. ఢిల్లీలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు మంగళవారం గజవాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కో వాహనసేవ ఉంటుంది. సాయంత్రం భూదేవి శ్రీదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో గజవాహన సేవ నిర్వహించారు.

లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్ పర్సన్ ప్రశాంతిరెడ్డి, కమిటీ సభ్యులు దగ్గరుండి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ‘నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో ఢిల్లీలోని తెలుగు వారితో పాటు అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు ప్రతిరోజూ పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. వేదమంత్రాల నడుమ స్వామి వారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు.

వేంకటరమణుడికి తొలిసారి ఈ ఉత్సవాలను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు. ఈనెల 3న అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీన పుష్పయాగంతో ముగుస్తాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement