Thursday, March 28, 2024

అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో ఆత్మహత్యల కలకలం

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీపేట మండలం మల్కపల్లిలో అప్పులబాధ కారణంగా ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. రమేష్, పద్మ దంపతులు ఓ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. వారి పిల్లలు అక్షయ్ (17), సౌమ్య (19) మృతదేహాలు మరోచోట పడవేసి ఉన్నాయి. కాగా ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల 30 ఎకరాల్లో పంట వేసిన తనకు తీవ్రంగా నష్టం వచ్చిందని.. ఏం చేయాలో తెలియక ప్రాణం తీసుకుంటున్నట్లు రమేష్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.

ఏపీలోనూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో ఆత్మహత్యల ఘటన కలకలం సృష్టించింది. ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయి. ఇద్దరు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరుకు చెందిన ఈ కుటుంబం.. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి ఈ అఘాయిత్యం చేసుకోవడం వెనుక కారణాలు అంతుబట్టడం లేదు.

దెందులూరు పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన పావులూరి వెంకట నారాయణ(70), కృష్ణతులసి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు కొంతకాలంగా వ్యాపారం నిమిత్తం గుంటూరులోని రాజేంద్రనగర్‌లో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు భానువికాస్‌(33)కు పదేళ్ల కిందట ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. వ్యాపారంలోనూ నష్టపోయారు.

బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం శివారు శింగవరం పొలాల్లో వీరు ముగ్గురు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. సమాచారం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి.. భానువికాస్‌ చనిపోయాడు. వెంకటనారాయణ, కృష్ణతులసి దంపతులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి వెంకటనారాయణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కృష్ణతులసి చికిత్స పొందుతున్నారు. ఏలూరుకు వచ్చిన ఆమె సోదరుడు పారా హరిబాబు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. పురుగుల మందును తాడేపల్లిగూడెంలో కొనుగోలు చేసినట్లు ఉంది. వారు గుంటూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు ఎందుకు వచ్చారో చెప్పలేకపోతున్నారు. ఎస్సై రామ్‌కుమార్‌ ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించారు. దెందులూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement