Thursday, September 21, 2023

Breaking | బీజేపీ అభ్య‌ర్థుల మొదటి విడత లిస్టు .. 11మందితో జాబితా విడుదల!?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో భాజపాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితా పేరుతో 11మందితో కూడిన లిస్టు గురువారం విడుదలైంది. ఈ జాబితా సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. ఆనక ఈ జాబితాను తాము విడుదల చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ఖండించినా జాబితా విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా కోసం బీజేపీలోని ఆశావహులు, నేతలు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి జులై చివరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో బీజేపీ అభ్యర్థుల తొలివిడత జాబితాను విడుదల అవుతుందని ఆశావహ నేతలు ఎదురు చూశారు.

- Advertisement -
   

బీజేపీ ముఖ్యనేతలు కూడా సెప్టెంబరు మొదటి వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పలు సందర్బాల్లో ప్రకటించారు. అయితే సెప్టెంబరు మొదటి వారం గడుస్తున్నా జాబితా విడుదలపై రాష్ట్ర నాయకత్వం ఉసెత్తకపోవడం, అదే సమయంలో ఆశావహుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఏకంగా 6వేల పైచిలుకు రావడంతో వాటన్నింటి స్క్రూట్నీ చేయడమనే అంశం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సవాల్‌గా మారింది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ జులై మొదటివారంలోనే ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం, ఆ తర్వాత బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వాటిని స్క్రూట్నీ కూడా చేసి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే.

దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ జాబితా ఎప్పుడు విడుదలవుతుందోన ని ఆశావహ నేతలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు… బీజేపీ కీలక నేతలు, ఎంపీ పదవుల్లో ఉన్న వారు కూడా ఈసారి అసెంబ్లిd ఎన్నికలకు పోటీ చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో వారు ఏయే స్థానాల నుంచి పోటీ చేస్తారోనన్న టెన్షన్‌ ద్వితీయశ్రేణి నేతల్లో నెలకొంది. ముఖ్యనేతలు పోటీ చేయబోయే స్థానాలు ముందే ఖరారైతే తాము టికెట్‌ ఆశించడంతోపాటు బరిలో దిగేందుకు చేసుకోవాల్సిన ఏర్పాట్లను కూడా ఉపసంహరించుకుంటామని అంబర్‌పేట, ఆర్మూరు, హుజురాబాద్‌, కరీంనగర్‌ తదితర అసెంబ్లి నియోజకవర్గాలకు చెందిన నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా పేరుతో అదికూడా కీలక నేతల పేర్లతో విడుదల కావడంతో వారు ఏయే స్థానాల్లో బరిలోకి దిగుతున్నారోనన్న చర్చ పార్టీ నేతల్లో విస్తృతంగా కొనసాగింది. తాజాగా విడుదలైన జాబితాలో… 11 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ – ఎంపీ బండి సంజయ్‌, ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్‌, హుజూరాబాద్‌ నుంచి పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పోటీ చేయనున్నారు.

ఇక బోథ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీ సోయం బాపూరావు, దుబ్బాకలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, కాగజ్‌నగర్‌లో హరీష్‌, నిర్మల్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థుల మొదటి విడత జాబితా అంటూ మీడియాలో వైరల్‌ అవుతున్న జాబితాను తాము విడుదల చేయలేదని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డే ప్రకటించారు. ఆ జాబితాతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఏది నిజం.. ఏది ఫేక్​..

అయితే.. ఈ జాబితా ఫేక్​ అనే సమాచారం సోషల్​మీడియాలో సర్య్కులేట్​ అవుతోంది. బీజేపీ సెంట్రల్​ అపీసు నుంచి జారీ అయినట్టు ప్రచారం జరగుతున్న జాబితా తప్పు అని అందులో పేర్కొన్నారు. దీంతో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియక నెటిజన్లు గందరగోళానికి గురవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement