Saturday, September 23, 2023

Delhi | తెలంగాణ పోలీసులకు ఫిక్కీ అవార్డ్.. ఢిల్లీలో అందుకున్న సీఐడీ చీఫ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పోలీసులు మరో అవార్డు అందుకున్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో కలిసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) హోంల్యాండ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సులో ఈ అవార్డును అందజేశారు. చైల్డ్ సేఫ్టీ విభాగంలో అందజేసిన ఈ అవార్డును శుక్రవారం ఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో తెలంగాణ సీఐడీ చీఫ్ మహేశ్ ఎం. భగవత్ అందుకున్నారు. బీఎస్ఎఫ్ డైరక్టర్ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రకాశ్ సింగ్, సీఐఎస్ఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేసిన మంజరి జరుహర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అరవింద్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరిగింది.

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల పోలీసు శాఖలు, 6 కేంద్ర పారామిలటరీ బలగాల నుంచి వచ్చిన 117 ఎంట్రీల్లో రాచకొండ పోలీసులు చేపట్టిన ‘వర్క్‌సైట్ స్కూల్’ ప్రాజెక్టు అవార్డుకు ఎంపికైంది. మహేశ్ భగవత్ గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నగర శివార్లలో ఇటుక బట్టీల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించేందుకు ‘ఆపరేషన్ స్మైల్’లో భాగంగా దాడులు జరిపారు. విముక్తి కల్పించిన బాల కార్మికులకు పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ‘వర్క్‌సైట్ స్కూల్’ ప్రాజెక్టు చేపట్టారు.

- Advertisement -
   

ఈ బట్టీల్లో పనిచేస్తున్న పిల్లల్లో అత్యధికులు ఒడిశా, మహారాష్ట్రకు చెందినవారేనని గుర్తించారు. వారికి వారి మాతృభాషలోనే పాఠశాల విద్యను అందించడం కోసం ‘వర్క్‌సైట్’ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఇటుక బట్టీ యజమానుల అసోసియేషన్, ఫిక్కీతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కోరి తీసుకున్నారు. సమీపంలోని పాఠశాలల్లో ఒక గదితో పాటు మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్లు ఏర్పాటు చేయగా, ఇటుకబట్టీ ఓనర్ల అసోసియేషన్ పిల్లలకు స్కూల్ యూనిఫాంతో పాటు రోజూ స్కూలుకు వచ్చి వెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేసింది.

స్వచ్ఛంద సంస్థలు ఒడియా, మరాఠీ భాషల్లో బోధించే అధ్యాపకులను అందజేశాయి. అలా ఒడియా, మరాఠీ భాషల్లో వలస బాలకార్మికులకు విద్యాబోధన అందింది. 2017-2022 మధ్యకాలంలో ఇలా 6,555 మంది బాలకార్మికులకు విద్యాబోధన అందించగలిగారు. తద్వారా ఏకకాలంలో బాలకార్మిక చట్టాలతో పాటు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి అందరికీ విద్య అందేలా చొరవ తీసుకున్నారు. ఈ చొరవకు అప్పట్లోనే విశేష స్పందన వచ్చింది. అదే ఇప్పుడు ఫిక్కీ హోంల్యాండ్ సెక్యూరిటీ అవార్డు అందుకోడానికి దోహపడింది.

అవార్డు అందుకున్న అనంతరం మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చొరవతో పోలీసుశాఖలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటితో పాటు వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నాయని తెలిపారు. తాజా అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement