Friday, May 3, 2024

రాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తన వ్యాపారం.. ఏప్రిల్‌, మే నెలల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల తయారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అవినీతి సొమ్ముకు మరిగిన వ్యవసాయశాఖలోని కొందరు అవినీతి అధికారుల కారణంగా రాష్ట్రంలో నకిలీ విత్తన వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ విత్తనాలు అమ్మితే ఖబడ్దార్‌, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సీఎం కేసీఆర్‌, డీజీపీ అంజనీ కుమార్‌ పదే పదే హెచ్చరిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఏటా వర్షాకాలం ఆరంభానికి ముందు మార్చి నుంచి మొదలుపెట్టి మే చివరికల్లా నకిలీ విత్తనాలను సిద్దం చేస్తున్న అక్రమార్కులు జూన్‌లో వానాకాలం సమీపించగానే మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కూరగాయల విత్తనాలు మొదలు పప్పు ధాన్యాలు, వరి, పత్తి విత్తనాల వరకు అంతటా యథేచ్ఛగా కల్తీ విత్తన వ్యాపారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీవిత్తన వ్యాపారం నెట్‌ వర్క్‌ విస్తరించి ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ మొదలు ఆదిలాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ ఇలా రాష్ట్రంలోని ప్రతి మూల మూలనా నకిలీ విత్తనాల బెడద ఏటా రైతులను నిండా ముంచుతోంది.

- Advertisement -

పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా వర్షాకాలం ఆరంభంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో ఎక్కువగా కల్తీ విత్తన వ్యాపారం పత్తి గింజలతోనే సాగుతుండడం గమనార్హం. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కనీసం 60లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది. ఒక ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి డిమాండ్‌ మేరకు దాదాపు 1.7కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను ఏటా వర్షాకాలం ఆరంభంలో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏటా వ్యవసాయశాఖ అతి కష్టం మీద కేవలం 80లక్షల పత్తి విత్తన ప్యాకెట్లనే అందుబాటులో ఉంచగలుగుతోంది. దీంతో మిగతా 40లక్షల ప్యాకెట్ల మేర పత్తి విత్తనాలకు కొరత ఏర్పడుతోంది. ఈ కొరతను ఆసరాగా తీసుకుంటున్న దళారులు, నకిలీ విత్తన తయారీదారులు యథేచ్ఛగా నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.

నకిలీ విత్తన వ్యాపారులు ఎరచూపే డబ్బులకు ఆశపడుతున్న ఫర్టిలైజర్‌ వ్యాపారులు మార్కెట్‌లోకి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో నకిలీ పత్తి విత్తనాలను తెచ్చి నాణ్యమైనవని, దిగుబడి ఎక్కువగా వస్తుందని, వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటాయని నమ్మించి రైతులకు అంటగడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో నిషేధిత బీజీ3 రకం పత్తి విత్తనాలను కూడా విక్రయిస్తుండడం విశేషం. పత్తి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే వరి, సోయాబిన్‌, మొక్కజొన్న, మిరప పంటలకు సంబంధించి కూడా నకిలీ విత్తన వ్యాపారం తెలంగాణలో జోరుగా సాగుతోంది.

విచ్చలవిడిగా సాగుతున్న ఈ నకిలీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకోవడంలో వ్యవసాయశాఖతోపాటు అన్ని శాఖలు ప్రతి ఏటా విఫలమవుతూనే ఉన్నాయి. వ్యవసాయ, పోలీసుశాఖలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల తయారీదారులు, సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1000కి పైగ నకిలీ విత్తన వ్యాపారులపై కీెసులు నమోదు చేశారు. 50 మందికి పైగా అక్రమార్కులపై పీడీ యాక్టు నమోదు చేశారు. అయినప్పటికీ నకిలీ విత్తన వ్యాపారానికి తెరపడకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement