Monday, April 29, 2024

టీచర్ల మెడపై ‘ఫేషీయల్‌’ కత్తి, ఒక్క నిమిషం లేటుకే నోటీసులు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఫేషియల్‌ యాప్‌ ద్వారా హాజరు వేసే విధానంలో తమపై వేధింపుల ఉంటాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందినట్లుగానే జరగుతోంది. తమ సొంత డివైజ్‌ల ద్వారా ఫేషీయల్‌ యాప్‌లో హాజరు వేయడంపై ప్రభుత్వం తమకు కొన్ని వెసులు బాట్లు ఇచ్చిందని, తీరా వాటి అమలును ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేసియల్‌ యాప్‌ ద్వారా హాజరు వేయడంలో పది నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తామని ముందు ప్రభుత్వం హామీనిచ్చింది. ఇక మూడు సార్లు గనుక ఆలస్యమయితే ఒక సగం రోజు క్యాజువల్‌ లీవ్‌ను కట్‌ చేయడానికి ఒప్పుకుంది. తాజాగా మాత్రం గుంటూరు జిల్లాలోని అచ్చంపేట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఒక్క నిమిషం లేటు చేసినందుకే నోటీసులు జారీ చేశారు. మొత్తం తొమ్మిది మందికి నోటీసులు ఇవ్వగా ఇందులో ఇద్దరు ఒక నిమిషం లేటుకాగా, ఇద్దరు రెండు నిమిషాలు, ఒకరు మూడు నిమిషాలు, ముగ్గురు ఐదు నిమిషాలు, ఒకరు 20 నిమిషాలు లేటుగా వచ్చారు. ప్రభుత్వం అంగీకరించి వెలువరించిన ఉత్తర్వుల ప్రకారమైతే వీరికి నోటీసలు ఇవ్వడానికి వీల్లేదు. పది నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ ఉంది. ఆలోపు ఫేషీయల్‌ యాప్‌లో హాజరు వస్తే సరిపోతుంది. ఒక్కరు తప్ప మిగిలిన ఎనిమిది మంది 10 నిమిషాల లోపే హాజరు నమోదు చేశారు. కానీ వారికి కూడా నోటీసులు జారీ చేశారు.

దీనిపై స్థానిక డి.ఇ.వోతో ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడినప్పటికీ నోటీసులు ఉపసంహరించుకునేందుకు ససేమీరా అంటున్నారు. ఫేషీయల్‌ రికగ్నషన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయడం తమకు ఎప్పటికైనా సమస్యగానే ఉంటుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. తమ డివైజ్‌లో ప్రాబ్లం ఉన్నా, నెట్‌వర్క్‌లో ప్రాబ్లం ఉన్నా తామే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. . తమపై కక్ష పాధించడానికి పై అధికారులకు, ప్రభుత్వానికి ఇదో ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని అంటున్నారు. అచ్చంపేటలోనూ అదే జరిగిందని, పది నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు. తాము వద్దంటున్నా బలవంతంగా తమపై ఈ విధానం రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులను వేధించడమే: ఎస్‌టియు

- Advertisement -

ఒక్క నిమిషం లేటుకే నోటీసులు ఇచ్చారంటే ఉపాధ్యాయులను వేధించాలనే ప్రభత్వ భావన కన్పిస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత సాయిశ్రీనివాస్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలు లేటు కావడం సహజమని, 10 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కూడా ఉందని, అయినా నోటీసులు ఇవ్వడం సరైంది కాదని అన్నారు. ఒకవేళ లేటు అయితే మూడు సార్లను కలిపి సగం సీఎల్‌ను కట్‌ చేయాలనే నిబంధన కూడా ఉందని అయినా అధికారులు నోటీసులు ఇవ్వడం ఉపాధ్యాయులపై కక్ష సాధించడమేనని అన్నారు.

నోటీసులు ఉపసంహరించాలి: యుటిఎఫ్‌

నిమిషాల పాటు లేటు వచ్చిందనకు అచ్చంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అద్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ప్రాధమిక విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement