Wednesday, May 1, 2024

స్ఫూర్తి పథకం గడువు పొడిగించండి.. కేంద్ర మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధులు సమకూర్చే పథకం ‘స్ఫూర్తి’ గడువును పొడిగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ (నరసరావుపేట) లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నారాయణ్ తాతు రానేకు లేఖ రాసిన ఎంపీ ఈ పథకం ద్వారా లక్షలాది మంది కళాకారులు లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. వస్త్రాలు, హస్తకళలు, వెదురు, వ్యవసాయ-ప్రాసెసింగ్, ఖాదీ, కాయిర్ మొదలైన రంగాలు దీని నుండి ఎంతో ప్రయోజనం పొందాయని తెలిపారు. ఈ పథకం కింద  ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 16 క్లస్టర్లు ఆమోదం పొందాయని, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరంలో 6 క్లస్టర్లు పని చేస్తున్నాయని తెలిపారు.

కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, బాపట్ల, కడపలో మిగిలిన క్లస్టర్లు ఇంకా అమలు దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ పథకం గడువు 2022 నవంబర్‌తో  ముగిసినందున అమలులో ఉన్న క్లస్టర్‌లలోని కళాకారులు దీన్ని కొనసాగిస్తారా లేదా అని ఆందోళన చెందుతున్నారని కేంద్ర మంత్రికి చెప్పారు. ఈ పథకాన్ని కొనసాగించేందుకు మంత్రివర్గం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, ఇతర జిల్లాల కళాకారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

దాదాపు 10,000 మంది హస్తకళాకారులు క్లస్టర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ అవి ఇంకా పెండింగ్‌లోనే  ఉన్నాయని వెల్లడించారు. వీటి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఆమోదించిన అన్ని క్లస్టర్‌లు పనిచేసే తేదీ వరకు స్ఫూర్తి పథకాన్ని పొడిగించే విషయాన్ని పరిశీలించి, కళాకారులకు  మేలు చేయాలని  కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement