Friday, April 26, 2024

పోలవరం అంచనా వ్యయం 47,725 కోట్లు.. వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోగా పూర్తికాకపోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020, 2022లో సంభవించిన భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విడివిడిగా ఈ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. ఆ ప్రకారం మార్చి 2024 నాటికి పోలవరం ప్రాజెక్టును, జూన్ 2024 నాటికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో నెలకొన్న జాప్యంతో పనులు పూర్తిచేయడానికి నిర్దేశిత లక్ష్యం కంటే మరికొంత అదనపు సమయం పడుతుందని సమాధానంలో పేర్కొన్నారు.

ఇకపోతే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఖర్చు చేసిన సొమ్మును కేంద్రం తిరిగి చెల్లిస్తోందని తెలిపారు. ప్రాజెక్టులో ‘ఇరిగేషన్ కాంపోనెంట్’ కింద అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. 2013-14 అంచనాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు కాగా 2017-18 సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 47,725.74 కోట్లకు చేరుకుందని కేంద్ర మంత్రి బదులిచ్చారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 15,970.53 కోట్లు ఖర్చు చేసిందని, అందులో ఇప్పటి వరకు రూ. 13,226.04 కోట్లు తిరిగి చెల్లించామని వెల్లడించారు.

- Advertisement -

ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని తెలిపారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సిఫార్సులతో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 483 కోట్ల ఖర్చుపై బిల్లులు పంపించిందని వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ. 6,461.88 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement