Thursday, April 18, 2024

కొత్త మునిసిపాలిటీలకు వరంగా టీఎస్‌బీపాస్‌.. హైదరాబాద్‌ శివార్లలో పెరుగుతున్న లే అవుట్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లో నిర్మాణ రంగం విస్తరిస్తోంది. నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని తీసుకురావడంతో నగర శివారులో కొత్తగా ఏర్పడ్డ మునిసిపాలిటీల్లో కొత్త లే అవుట్‌లు పెరుగుతున్నాయి. వీటన్నింటికి ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవడానికే వెంచర్లు యజమానులు మొగ్గు చూపుతుండడంతో మునిసిపాలీటలకు ఆదాయం పెరుగుతోంది. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన లే అవుట్‌లలోని ప్లాట్లకు మాత్రమే మంచి డిమాండ్‌ ఉందని వెంచర్ల యజమానులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ తూర్పు వైపున శివార్లలో కొత్తగా ఏర్పడ్డ మునిసిపాలిటీల్లో ఈ రెండేళ్ల కాలంలో కొత్త లే అవుట్‌లు ఎక్కువగా అనుమతులు పొందాయి. నగరానికి మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్‌) తూర్పున రియల్‌ ఎస్టేట్‌ విస్తరణకు కేంద్రంగా మారింది.

అవుటర్‌ చుట్టూ హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోందని గడిచిన రెండేళ్లలో అవుటర్‌కు ఆనుకుని ఉన్న మునిసిపాలిటీలు ఇచ్చిన నిర్మాణ అనుమతులు నిరూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2020 నవంబరు నుంచి 2022 నవంబరు దాకా శివారులోని కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో మంజూరైన అనుమతుల్లో తూర్పు మునిసిపాలిటీలు ముందంజలో ఉన్నాయి. శ్రీశైలం హైవేపై ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఉండే తుక్కుగూడ మునిసిపాలిటీ నుంచి ప్రారంభిస్తే ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్‌, పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేట, తూముకుంట, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ పురపాలక సంస్థల పరిధిలో కొత్త లేవుట్‌లకు ఎక్కువగా అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే 600 చదరపు గజాలకు మించి విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాల పరంగా ఈ మునిసిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి. నగరానికి పశ్చిమాన ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న అమీన్‌పూర్‌, నిజాంపేట, మణికొండ, నార్సింగి, బండ్లగూడ తదితర మునిసిపాలిటీల్లో బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు జారీ అవుతున్నాయి. నగరానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాలు బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాలకు నెలవుగా మారాయి. అయితే శివారులో కొత్తగా ఏర్పడ్డ మునిసిపాలిటీల్లో పది లోపే లే అవుట్‌లకు అనుమతులు జారీ అవడం గమనార్హం.

సీఎం వ్యాఖ్యలతో శివారు ప్రాంతాల్లో ఆశలు…

ఇటీవల ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్‌ అవుటర్‌ రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు కారిడార్లు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడంతో శివార్లలో నిర్మాణ రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో మెట్రో వచ్చిన ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశన్నంటడాన్ని ఆ వర్గాలు ఇందుకు ఉదహరిస్తున్నాయి. నగరం విస్తరించి అవుటర్‌ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్‌) రానున్న రోజుల్లో ఇన్నర్‌ రింగురోడ్డుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement