Wednesday, May 1, 2024

విద్యుత్ సంస్కరణలతో ప్రజలకు మేలే.. సబ్సిడీలు, ఉచితాలకు అడ్డు కాదు: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విద్యుత్ సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తప్పుబట్టారు. ప్రజలకు మేలు చేయడం కోసమే విద్యుత్ సంస్కరణలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లులో పొందుపర్చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కల్పిస్తాయని తెలిపారు.

ఈ బిల్లు ద్వారా విద్యుత్ రంగంలో పోటీ తత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. పోటీతత్వం ద్వారా మార్కెట్లో మోనోపోలీ (గుత్తాధిపత్యం) పోతుందని, గుత్తాధిపత్యం ఎన్నటికీ ప్రజలకు వ్యతిరేకమే అన్న సంగతి మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గుత్తాధిపత్యాన్నే కోరుకుంటున్నారని అన్నారు.

విద్యుత్ బిల్లు, సంస్కరణలపై తాను గతంలోనూ వివరణ ఇచ్చానని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు, ఉచితాలకు ఈ బిల్లు ఏరకంగానూ అడ్డు కాదని స్పష్టం చేశారు. రైతులకు మాత్రమే కాదు, సమాజంలోని ఏ వర్గం వారికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చినట్టుగా ఉచిత విద్యుత్ ఇచ్చుకోవచ్చని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఈ సబ్సిడీలు, ఉచితాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, అభ్యంతరం అసలే లేదని అన్నారు.

తాము కేవలం మార్కెట్లో పోటీతత్వాన్ని తీసుకొస్తున్నామని, తద్వారా ప్రజలు గుత్తాధిపత్యం ప్రదర్శించే ఒక కంపెనీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు. ఇకపోతే చట్టాలు చేయడం, వెనక్కి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వ్యవసాయ శాఖ తన పరిధిలోనిది కాదని, విద్యుత్ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement