Thursday, April 25, 2024

Delhi: ట్రయల్ కోర్టులో విచారణ ఇన్నేళ్లా?.. గాలి జనార్ధన్ రెడ్డి కేసుపై సుప్రీంకోర్టు విస్మయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సుదీర్ఘకాలంగా సాగుతున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డిపై గనుల అక్రమ తవ్వకాల ఆరోపణల సీబీఐ కేసు విచారణపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.12 ఏళ్లపాటు విచారణ సాగుతుండడంతో ట్రయల్ కోర్టులో ఇన్నేళ్లపాటు విచారణా అని విస్మయం వ్యక్తం చేసింది. బెయిల్ షరతులు సడలించాలని గాలి జనార్ధన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు.

కేసు విచారణ జరుగుతున్న తీరు సరికాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీబీఐ అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకోమని అదనపు సోలిసిటర్ జనరల్ కు సూచించింది. తీవ్రమైన అభియోగాలు నమోదైన కేసులో 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ సీబీఐ కేసులు న్యాయస్థానం ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ఎదుట విచారణ సాగకపోవడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో ఈ 19లోగా సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి నివేదిక అందజేయాలని ఆదేశించి ఈ నెల 20కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement