Wednesday, April 24, 2024

Delhi: విశాఖకు మరో రెండు సీజీహెచ్‌ఎస్ ఆసుపత్రులు.. ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తికి కేంద్రం సానూకూలం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథక (సీజీహెచ్‌ఎస్) కార్యాలయ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. నగరానికి మరో రెండు సీజీహెచ్‌ఎస్ ఆసుపత్రులు, కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆయనను కలిసిన జీవీఎల్ ఆంధ్రప్రదేశ్‌లో సీజీహెచ్‌ఎస్ కార్యకలాపాలకు ప్రత్యేక అదనపు డైరెక్టర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు జీవీఎల్ కేంద్రమంత్రికి వినతి పత్రం సమర్పించారు. విశాఖపట్నంలో అత్యధిక కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం లబ్ధిదారులు ఉన్నారని, ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్‌లో నియమితులైన అదనపు డైరెక్టరే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీజీహెచ్‌ఎస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని మన్సూఖ్ మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో సీజీహెచ్‌ఎస్‌కు ప్రత్యేక అదనపు డైరెక్టర్లు ఉన్నారని, ఏపీలో ప్రత్యేక కార్యాలయం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులకు ఆరోగ్య సేవలు అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని జీవీఎల్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 120కి మించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం సరైన స్థలమని జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు.

విశాఖలో 28 వేల మంది లబ్దిదారులు ఉండగా కేవలం రెండు సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయని, ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నగరానికి మరో రెండు సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్లను మంజూరు చేయాలని జీవీఎల్‌ నరసింహారావు కేంద్రమంత్రిని అభ్యర్థించారు. మంత్రిని కలిసిన అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ తన విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్‌కు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల శస్త్ర చికిత్సలు, ప్రత్యేక చికిత్సలు, బిల్లుల రీఎంబర్స్‌మెంట్, మందుల పంపిణీ తదితరాల వ్యవహారాలకు వేగంగా అనుమతులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త వెల్‌నెస్ సెంటర్లు లబ్ధిదారులకు నాణ్యతమైన సేవలు అందించడానిక ఉపయోగపడతాయని జీవీఎల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement