Tuesday, May 14, 2024

వానాకాలంలో ఎండాకాలం.. తీవ్ర ఆందోళనలో రైతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నెల రోజులుగా వర్షాలు లేకపోగా విపరీతమైన ఎండలు కాస్తుండడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. నెలరోజులుగా ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వర్షాధార పంటలై పత్తి, మిర్చి, మొక్కజొన్న, కందితోపాటు వరి చేలు కూడా ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో వేసవికాలాన్ని తలపించేలా ఎండలు నమోదవుతున్నాయి.

ప్రతీ రోజూ 34డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రతతో భూమిలో తేమ తగ్గిపోతోంది. భూమి పొడిగా మారుతుండడంతో పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు వాడిపోతూ క్రమంగా ఎండిపోతున్నాయి.

ఈ ఏడాది నైరుతి సీజన్‌లో గడిచిన జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో రెండు నెలలు అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో ఆలస్యంగా నైరుతి ప్రారంభమవడం, జులై నెల రెండో వారంలో వానలు ఉపందుకుని నెలాఖరులో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ తర్వాత ఆగస్టు నెల మెత్తం వానలు కురవలేదు. ఆగస్టులో సాధారణ వర్షపాతం 21.74సెంటీమీటర్లు కాగా కేవలం 7.97 సెంటీమీటర్లే కురిసింది.

- Advertisement -

క్రమబద్ధమైన వర్షాపాతం లేకపోవడంతో యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, వరంగల్‌, జగిత్యాల, హన్మకొండ, జనగామ, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్‌, వికారాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, మెదక్‌ , నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మంచిర్యాల, కొమరం భీం, భద్రాద్రి, ములుగు, వనపర్తి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

వరిని పట్టిపీడిస్తున్న తెగుళ్లు…

వర్షాలు జాడలేకపోవడం, వాతావరణంలోమార్పుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో వరిలో వేరుకుళ్లు, కాటుక తెగుళ్లు విజృంభిస్తున్నాయి. కాండం తొలుచు పురుగు విజృంభిస్తుండడంతో వరిచేలు ఎర్రబారి ఎండిపోతున్నాయి. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో దాదాపు 50లక్షల ఎకరాల్లో వరి సాగయింది. వరినాట్లు ఇప్పుడిప్పుడూ పూర్తవుతున్నాయి. ఈ దశలో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావులు, బోర్లలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో వర్షాకాలంలోనూ వరి చేలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు.

ఎదగని పత్తి..

పత్తి మొక్క ఎదుగుదలలోపించడంతోపాటు కొమ్మలు రావడం లేదని, వర్షం లేని కారణంగా భూమి గట్టిపడి పోషకాలు మొక్కకు అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఈ ఏడాది పత్తి సాగు నష్టాలను మిగల్చడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టు-బడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవకపోగా ఎండలు కూడా పెరగడంతో వర్షాధార పంటలు సాగు చేసిన రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 39 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయింది.

వాడిపోతున్న మిర్చి మొక్కలు…

ఆగస్టు మొత్తం చినుకులు జాడలేకపోవడంతో ఎర్రబంగారంగా పిలిచే మిర్చిపంట సాగుపై ఆదిలోనే నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షాలు పడకపోవడంతోపాటు ఎండలు పెరగడంతో మిర్చి మొక్కలకు వేరుకుళ్లు తెగులు సోకుతోంది. దీంతో మొక్కలు వాడిపోతున్నాయి. మొక్కలకు నీరందకపోవడంతోపాటు పైనుంచి తీవ్రమైన ఎండ కారణంగా మిర్చి మొక్కలు వాడిపోయి ఒడి తిరుగుతున్నాయి.

వడలిపోతున్న మొక్కజొన్న…

వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే నాలుగైదు అడుగుల వరకు ఎదగాల్సిన మొక్కజొన్న మొక్కలు కనీసం రెండు అడుగులు కూడా పెరగలేదు. విపరీతమైన ఉష్ణోగ్రతలకు మొక్కలు వాడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో దాదాపు 20లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వర్షాధార పంటగా సాగవుతోంది.

సెప్టెంబరుపైనే రైతుల ఆశలు…

ఆగస్టులో తీవ్ర వర్షాభావంతో నెలకొన్నా సెప్టెంబరులోనైనా వరుణుడు కరుణించకపోతాడా..? అని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. వాస్తవానికి సెప్టెంబరుతో వర్షాకాలం ముగుస్తుంది. కనీసం చివరి నెలలోనైనా వర్షాలు కురుస్తాయని, ఎండిపోతున్న పంటలకు ప్రాణం వస్తుందని ఆశగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement