Friday, April 26, 2024

చిత్తూరుకు తాకిన డ్రగ్స్‌ మాఫియా.. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు

చిత్తూరు కార్పొరేషన్‌, ప్రభ న్యూస్‌ : ఎక్కడో ప్రముఖ నగరాలలో జరిగే డ్రగ్స్‌ సరఫరా వ్యవహారం ఇప్పుడు చిత్తూరుకు కూడా పాకింది. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే లక్ష్యంగా పెట్టుకున్న డ్రగ్స్‌ మాఫియా వివిధ రూపాలలో మత్తు పదార్థాలను వారికి సరఫరా చేస్తోంది. మత్తు పదార్థాల సరఫరాపై చిన్నపాటి క్లూ రావడంతో పోలీసులు ఎట్టకేలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి అయినటు-వంటి సుడాన్‌ దేశానికి చెందిన వ్యక్తిని పట్టుకున్నారు.

అతని ద్వారా చిత్తూరు , తిరుపతి జిల్లాలకు సరఫరా చేసే ముఠా సభ్యుల్లో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు . చిత్తూరు నగరంలో డ్రగ్స్‌ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చిత్తూరు నగర డి.ఎస్‌.పి సుధాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో డ్రగ్స్‌ విక్రయించే వ్యక్తుల పై పోలీసు అధికారులు నిఘా ఉంచారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 10:30 గంటలకు చిత్తూరు నగరం ఇరువారం జంక్షన్‌ సమీపంలోని బాల త్రిపుర సుందరి దేవస్థానం వద్ద కొందరు వ్యక్తులు డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలియడంతో రాష్ట్రంగా డ్రగ్స్‌ విక్రరించే వారి కోసం వేచివున్న పోలీసులు నిర్దేశించిన ప్రాంతం వద్ద డ్రగ్స్‌ అమ్మడం కోసం పంచుకుంటు-న్న 8 మంది వ్యక్తులను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించారు.

వీరిలో ఇద్దరు తప్పించుకోగా, ఆరుగురిని అరెస్ట్‌ చేసి, వారి నుండి 2 లక్షల రూపాయల విలువ గల సుమారు 34 గ్రాముల ఎండిఎంఏ మేథంఫేటమిన్‌ అను డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు . పోలీసులకి పట్టు-బడిన ఆరుగురిలో ప్రధాన సూత్రధారి అయినటు-వంటి సుడాన్‌ దేశానికి చెందిన అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ కూడా ఉన్నాడు. ఇతను బెంగళూరులో ఉంటు-న్నాడు ఇతనికి కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన డ్రగ్స్‌ ముఠాతో సంబంధం ఉంది వారి ద్వారానే చిత్తూరు తిరుపతి కొంతమంది ఏజెంట్లను ఎంపిక చేసుకుని డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ,అరగొండకు చెందిన సిరాజ్‌ బెంగళూరులో పని చేస్తూ ఉండగా, బెంగళూరు సిటీ-, బిటీ-ఎం లేవుట్‌ ప్రాంతంలో సూడాన్‌ దేశానికి చెందిన అహమద్‌ ఒమర్‌ అహమద్‌ పరిచయం కావడంతో అతని ద్వారా డ్రగ్స్‌ వాడే అలవాట్లు నేర్చుకొని, అతని నుండి డ్రగ్స్‌ కొనుక్కొని బెంగళూరులో అమ్ముకుంటూ అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు.

తరువాత సిరాజ్‌ చిత్తూరు నగరానికి చెందిన సురేష్‌, ప్రతాప్‌, తేజ కుమార్‌, వెంకటేష్‌ అలియాస్‌ వెంకి మార్లీ, జయశంకర్‌, మోహన్‌ అలియాస్‌ సంతోష్‌, మురళీలతో పరిచయాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఆ పరిచయంలో భాగంగా సిరాజ్‌ వారితో డ్రగ్స్‌ వ్యాపారం గురించి చెబుతూ, ప్రస్తుతం యువకులు ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, డ్రగ్స్‌ వాడడం వలన శరీరం యాక్టీవ్‌ గా ఉంటుందని, ఎదో తెలియని ఎనర్జీ వస్తుందనీ, శరీర బరువు కూడా తగ్గే అవకాశం ఉందని, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారని, ఈ డ్రగ్స్‌ ని నోటి ద్వారా, ముక్కు ద్వారా లాక్కోవడం మరియు స్టెరిల్‌ వాటర్‌ నందు ఈ డ్రగ్స్‌ని కలిపి ఇంజక్షన్‌ వేసుకోవడం చేయాలని వివరంగా చెప్పాడు.

ఈ నేపథ్యంలోనే ఆదివారం సుడాన్‌ దేశానికి చెందిన అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ను సిరాజ్‌ మరియు పై వారందరూ డ్రగ్స్‌ తీసుకొని చిత్తూరుకి రమ్మని చెప్పడంతో, సదరు అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ చిత్తూరు నగరం ఇరువారం జంక్షన్‌ వద్ద గల బాల త్రిపుర సుందరి దేవస్థానం వద్ద పై వారందరూ కలసి డ్రగ్స్‌ అమ్మడానికి పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా, వారిలో 6 మందిని పోలీసులు పట్టుకోగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఇదిలా ఉండగా పట్టుబడిన ఆరుగురి ముఠా సభలో నలుగురు చిత్తూరు నగరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement