Friday, March 29, 2024

ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో కులవివక్ష దూరం.. ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ లక్ష్యం నెరవేరుతుంది

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆర్థికంగా వెనుకబడిన ఉన్నతవర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యుఎస్) కోటాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సెంట్రల్ కోఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్‌రాజ్ స్వాగతించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ “అంత్యోదయ” సిద్ధాంతం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” లక్ష్యాన్ని నిజం చేసేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, ఈ రిజర్వేషన్ విధానం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు.

దేశంలో ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదన్న మోదీ ఆలోచనల నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా ఏర్పడిందని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ అమల్లోకి తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదరికం గురించి మాట్లాడ్డమే తప్ప, పేదరిక నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఈ రిజర్వేషన్లపై ఉన్న న్యాయపరమైన ఇబ్బందులు సైతం తొలగిపోయాయని, ఈ రిజర్వేషన్లతో కులవివక్షను సైతం నిర్మూలించవచ్చని బాల్‌రాజ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement