Friday, May 17, 2024

Karnataka | నియామక పరీక్షలకు డ్రెస్‌కోడ్‌.. కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ నిర్ణయం

కర్ణాటకలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తలను కప్పివుంచే ఎలాంటి ముసుగులు, టోపీలు ధరించడానికి వీల్లేదని ఎగ్జామినేషన్‌ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు నియామక పరీక్షల కోసం ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్‌ను నివారించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు డ్రెస్‌కోడ్‌కు సంబంధించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులు తల, ముఖం, చెవులు, నోటిని కప్పివుంచేలా టోపీలు, ఇతర దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ (కెఈఏ) వెల్లడించింది. దీంతోపాటు లోహపు ఆభరణాలను కూడా అనుమతించబోమని చెప్పింది. అయితే, వివాహిత మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి వచ్చేందుకు మాత్రం అనుమతించింది.

గతంలో వీటిపైనా కేఈఏ నిషేధం విధించగా, కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో తాజా ఉత్తర్వుల్లో వీటికి మినహాయింపు ఇచ్చారు. కాగా ఈనెల 18-19 తేదీల్లో రాష్ట్రంలో పలు బోర్డులు, కార్పొరేషన్ల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో తాజాగా డ్రెస్‌కోడ్‌ నిబంధనలు ప్రకటించారు. గతంలో హిజాబ్‌పై పెద్‌ ఎత్తున ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ డ్రెస్‌కోడ్‌ మరోసారి చర్చకు దారితీసింది. తాజా నిబంధనల్లో హిజాబ్‌ను నేరుగా ప్రస్తావించనప్పటికీ, తలను కప్పివుంచే దుస్తులపై నిషేధం ఉండటంతో హిజాబ్‌ను ధరించేందుకు కూడా అనుమతి ఉండబోదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement