Friday, April 26, 2024

Delhi: లక్ష్మణ్‌కు డబుల్ ప్రమోషన్, బీజేపీ అత్యున్నత కమిటీ పార్లమెంటరీ బోర్డులో చోటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలిగా చెప్పుకునే పార్లమెంటరీ బోర్డులో ఆయనకు అధిష్టానం చోటు కల్పించింది. తద్వారా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కింది. బుధవారం విడుదల చేసిన ప్రకటన పార్టీలో పెను ప్రకంపనాలకు దారితీసింది. పార్లమెంటరీ బోర్డులో ఇప్పటి వరకు సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను తొలగించడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు పార్టీలోని అత్యున్నత నిర్ణయాత్మక మండలిలో చోటు కల్పిస్తారని ప్రచారం జరిగినా, ఆయనకు అవకాశం కల్పించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ షిండే కోసం త్యాగం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించగా.. కర్నాటకలో అధిష్టానం ఆదేశాల మేరకు పదవీత్యాగం చేసిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు పార్లమెంటరీ బోర్డులో అధిష్టానం చోటు కల్పించింది. మొత్తంగా కొత్తగా 6 గురికి చోటు కల్పిస్తూ పార్లమెంటరీ బోర్డులో ప్రక్షాళన చేపట్టింది. కొత్తగా పార్లమెంటరీ బోర్డులో కొత్తగా చోటు పొందినవారిలో బీఎస్. యెడ్యూరప్ప, శర్బానంద్ సోనోవాల్, డా. కే. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారాయణ్ జటియా ఉన్నారు.

11 మంది సభ్యులతో ఉండే పార్లమెంటరీ బోర్డుకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాయే అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. పార్టీ తీసుకునే కీలక రాజకీయ నిర్ణయాలను పార్లమెంటరీ బోర్డులోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూర్పు:

  1. జగన్ ప్రకాశ్ నడ్డా (అధ్యక్షుడు)
  2. నరేంద్ర మోదీ
  3. రాజ్‌నాథ్ సింగ్
  4. అమిత్ షా
  5. బీఎస్ యెడ్యూరప్ప
  6. శర్బానంద్ సోనోవాల్
  7. కే. లక్ష్మణ్
  8. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
  9. సుధా యాదవ్
  10. సత్యనారాయణ్ జటియా

11. బీఎల్ సంతోష్ (పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి)

బీజేపీ పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కూడా ప్రక్షాళన చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ బోర్డులో ఉండే 11 మందితో పాటు మరో నలుగురిని కలిపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేస్తుంది.

- Advertisement -

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ

  1. జగన్ ప్రకాశ్ నడ్డా (అధ్యక్షుడు)
  2. నరేంద్ర మోదీ
  3. రాజ్‌నాథ్ సింగ్
  4. అమిత్ షా
  5. బీఎస్ యెడ్యూరప్ప
  6. శర్బానంద్ సోనోవాల్
  7. కే. లక్ష్మణ్
  8. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
  9. సుధా యాదవ్
  10. సత్యనారాయణ్ జటియా
  11. భూపేంద్ర యాదవ్
  12. దేవేంద్ర ఫడ్నవీస్
  13. ఓం మాథుర్
  14. బీఎల్ సంతోష్ (పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి)
  15. వనతి శ్రీనివాస్

లక్ష్మణ్‌కు వరుస పదోన్నతులు – కీలక బాధ్యతలు
భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చాకు జాతీయాధ్యక్షుడిగా నియమితులైన డా. కే. లక్ష్మణ్‌కు వరుసగా పదోన్నతులు లభిస్తున్నాయి. ఓబీసీ మోర్చా పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించి, ఓబీసీ మోర్చా విభాగాన్ని పటిష్టం చేస్తూ, ఓబీసీ వర్గాలను బీజేపీ వైపు ఆకర్షితులను చేసే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డా. లక్ష్మణ్‌కు ఈ మధ్యనే ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అధిష్టానం అవకాశం కల్పించింది. ఇది జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి – బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించింది. దీంతో ఆయన కేంద్ర ఎన్నికల కమిటీలోనూ సభ్యుడయ్యారు. ఒకేసారి ఇన్ని కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కమలనాథులు ఓబీసీలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement