Friday, May 3, 2024

Doors Closed – కాంగ్రెస్ లో ఆ 12 మందికి నో ఎంట్రీ …..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో చేరికల జోరు పెంచింది. గతంలో కాంగ్రెస్‌ వీడిన వారిని ఘర్‌వాపస్‌ పేరుతో సొంత గూటికి రావాలని, మరో వైపు అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు మిగతా రాజకీయ పార్టీల్లోని అసంతృప్తలకు ఆఫరేషన్‌ ఆకర్షన్‌ మొదలు పెట్టింది. స్వయంగా రాహుల్‌గాంధీ గతంలో కూడా కాంగ్రెస్‌ వీడిన వారికి పార్టీలోకి వెలకమ్‌ చెప్పారు. ఇటీవలనే బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనయక్యలు రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఖమ్మం వేదికగా కాంగ్రెస్‌లోకి వచ్చారు. మరో వారం పది రోజుల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పార్టీ కండువా కప్పుకోనున్నారు. అంతే కాకుండా వివిధ పార్టీల్లోని అసంతృప్తులు, బలమైన నాయకులను చేర్చుకుని రాష్ట్రంలో మరింత బలపడాలని.. తద్వారా అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ లోని ఆ 12 మంది నాయకులకు మాత్రం నో ఎంట్రీ చెప్పాలని టీ పీసీసీ నిర్ణయించింది. 2018 అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో నుంచి 12 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పి కారు ఎక్కారు. వీరిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి( మహేశ్వరం), సుదీర్‌రెడ్డి ( ఎల్బీనగర్‌), పైలెట్‌ రోహిత్‌ రెడ్డి (తాండూరు), హర్షవర్దన్‌రెడ్డి ( కొల్లాపూర్‌), చిరుమర్తి లింగయ్య (నకిరెకల్‌), సురేందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్లు (కొత్తగూడెం) హరి ప్రియా నాయక్‌ (ఇల్లెందు), రేగ కాంతరావు (పినపాక), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), ఆత్రం సక్కు (ఆసిపాబాద్‌) ఉన్నారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో కొందరికి వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు రావానే ప్రచారం జరుగుతోంది. ఒక వేళ టికెట్లు ఇచ్చినా ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటమి చెందకతప్పదని చెబుతున్నారు.

కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తిరిగి సొంత గూటికి రావాలని ప్రయత్నిస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్‌ను వదిలారని, ఇలాంటి వారిని చేర్చుకోవడం కంటే ఆయా నియోజక వర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులపై ఫోకస్‌ పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలున్నారు. ఈ నియోజక వర్గాల్లో గతంలో పోటీ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వారిలో బలమైన నాయకులను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే కొల్లాపూర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్షారావును చేర్చుకొని ఈ ఎన్నికల్లో పోటికి దింపాలనే ఆలోచన చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రవీందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకుని ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచన చేస్తున్నారు. నకిరెకల్‌లో చిరుమర్తి లింగయ్యకు పోటీగా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరేశం చేరిక విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధీటుగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారు. సబిత చేతిలో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్థారెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు చర్చల చేసినట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి రంగరెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్‌రు బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి వస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఆయన టీడీపీ, టీఆర్‌ఎస్‌లో మంత్రిగా పని చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ తర పున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనకు వికారాబాద్‌లో మంచి పట్టున్న నేతగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నప్పటికి.. ఆ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో బీజేపీకి గుడ్‌ బై కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగు తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నాయకులు పవన్‌కుమారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement