Tuesday, April 30, 2024

ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ పెద్దలతో మంతనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. నిజానికి ఇద్దరు నేతలు మంగళవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, అమిత్ షాతో సమావేశమవుతారని కథనాలు వెలువడ్డాయి. అయితే అమిత్ షా గుజరాత్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆ ఇద్దరితో కాకుండా పార్టీలో మరికొందరు కీలక నేతలతో సమావేశమైనట్టు తెలిసింది. మునుగోడు ఉపఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఢిల్లీ చేరుకున్న ఈ నేతలిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బీజేపీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఈటల గెలుపొందగా, రాజగోపాల్ రెడ్డి కొద్ది తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పుకునే మునుగోడు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి బలమైన పోటీనిచ్చి రెండోస్థానంలో నిలబడడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. పైగా బీజేపీకి ఏమాత్రం పట్టులేని నల్గొండ జిల్లాలో ప్రవేశం దొరికినట్టయిందని విశ్లేషించుకుంటున్నారు. ఈ తరుణంలో నేతలిద్దరినీ పార్టీ హైకమాండ్ పిలిపించి మునుగోడు ఉప ఎన్నికల విషయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ బీజేపీ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పర్యటన చేపట్టిన మోదీ ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఉపఎన్నిక కోసం ప్రభుత్వం అంతా దిగొచ్చిందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి నేతలిద్దరికీ పిలుపురావడం మరింత ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇకపై మరిన్ని చేరికలు.. బలమైన నేతలకు ఆహ్వానాలు

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలను ప్రోత్సహించేందుకు ఈటల రాజేందర్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక కమిటీని బీజేపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతల కారణంగా బీజేపీకి పెద్దగా పట్టు లేని ప్రాంతాల్లో కూడా అనూహ్యరీతిలో పార్టీ పుంజుకుంటోందన్న విషయాన్ని అధిష్టానం గ్రహించింది. ఈ క్రమంలో పార్టీలోకి ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. ఫాంహౌజ్ వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి రచ్చ చేస్తూ బీజేపీకి ఆపాదిస్తున్న నేపథ్యంలో.. అధికారికంగా చేరికలపై ఏర్పాటు చేసిన కమిటీతో బహిరంగంగానే చేరికల ప్రక్రియ, కసరత్తును వేగవంతం చేయాలని చూస్తోంది. తద్వారా బీజేపీలో చేరికలు దొంగచాటు వ్యవహారాలు కాదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశాల గురించి చర్చించేందుకే ఈటలను ఢిల్లీకి పిలిపించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement