Monday, April 29, 2024

సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే మూడు రాజధానులపై చర్చ.. ఎంపీ జీవీఎల్ మండిపాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, రాజధాని వ్యవహారంతో పాటు అధికార, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని తప్పుదారిపట్టిన బలహీన ప్రతిపక్షంగా జీవీఎల్ అభివర్ణించారు. అలాంటి ప్రతిపక్షం కారణంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం జరగడం లేదని అన్నారు. కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య బూతుల పోటీలు మాత్రమే జరుగుతున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు, ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి గతంలోనే స్పష్టం చేశామని, ఆనాడు అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నది తమ విధానమని పునరుద్ఘాటించారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలను ఏర్పాటుచేయడం కోసం భూమిని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయని, కొన్ని సంస్థలు చెల్లింపులు కూడా చేశాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంస్థకు కూడా కేటాయింపులు జరపలేదని ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుళ్లూరులో స్థలం కేటాయించాలని కోరితే ఇంతవరకు స్పందన లేదని మండిపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలోనూ ఇదే తంతు అన్నారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఏర్పాటు కోసం రూ. 22 కోట్లు చెల్లింపులు కూడా జరిపిందని, అయినా సరే స్థలాన్ని కేటాయించలేదని తెలిపారు.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అంటున్న వైఎస్సార్సీపీ వాదనను జీవీఎల్ పూర్తిగా తప్పుబట్టారు. రాజధానితో నిమిత్తం లేకుండా అభివృద్ధిని వికేంద్రీకరించవచ్చని తెలిపారు. రాజధాని కేంద్రీకృత అభివృద్ధి పాలనాపరమైన లోపమే తప్ప అభివృద్ధి చేయడానికి అడ్డంకులు ఏమీ ఉండవని అన్నారు. హైదరాబాద్ విషయంలో నాటి పాలకులు తమ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధిని అక్కడికే పరిమితం చేశారని, ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. అయితే ఇందుకు మూడు రాజధానులు ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదని అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది బీజేపీ విధానపరమైన నిర్ణయమని, అయితే హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన దాన్ని న్యాయ రాజధాని అని పేర్కొనడం సరికాదని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరో నగరంలో ఉన్నాయని, అంతమాత్రాన అవి రాజధానులు కావని తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయడం, నివేదికలివ్వడం జరిగిందని, కానీ ఆ నివేదికలు బయటకు మాత్రం రావడం లేదని అన్నారు. సిట్ నివేదికలో ఏముందో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా విఫలమైనందున అధికారపార్టీ వైఫల్యాలను తాము ఎండగడతామని జీవీఎల్ అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ గుర్తుచేస్తూ వాటిని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పోరుబాట మొదలుపెట్టి 5,000 సభలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి నిజమైన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. హంగు, ఆర్భాటాలతో వేడుకలు జరపకుండా రక్తదానం, చెట్లు నాటడం వంటి సేవా కార్యక్రమాలకు పరిమితం కావాలని సూచించినట్టు తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2న జరిగే మహాత్మా గాంధీ జయంతి వరకు రెండు వారాల పాటు రాష్ట్రంలో బీజేపీ పోరుబాట చేపడుతుందని వెల్లడించారు.

మీడియా సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్లకు సీబీఐ తలొగ్గే ప్రసక్తే ఉండదని అన్నారు. మరోవైపు కొత్తపల్లి గీత దంపతులకు జైలుశిక్ష వ్యవహారాన్ని ఉదహరిస్తూ తమ మీద కేసులున్న నేతలు బీజేపీలో చేరినంత మాత్రాన రక్షణ పొందవచ్చని అనుకోడానికి వీల్లేదని అన్నారు. బీజేపీ నేతలు ఎవరిపై కేసులున్నా సరే.. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోలేకపోయిన కేసియార్, దళితులకు ఇంకేమి చేస్తారని అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి మభ్యపెట్టడం తప్ప ఆయన చేసేదేమీ లేదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement