Wednesday, May 8, 2024

AP | గిరిజన ప్రాంతాల్లో సాంకేతిక విప్లవం.. డిసెంబర్‌ నాటికి మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్‌ సేవలు

అమరావతి, ఆంధ్రప్రభ : టెక్నాలజీ మనుషుల జీవన విధానంలో ఒక భాగమైనా.. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని మనుషులు వారు. సమాజానికి దూరంగా అక్కడక్కడా విసిరేసినట్లు ఉండే గిరిజన గ్రామాలవి ! ఇక్కడ నివశించే వారిలో 70 శాతం నిరక్ష్యరాస్యులే! ఈ గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం..అక్షరాస్యత అంతంత మాత్రమే! ఉదయం లేచిన మొదలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించడమే వారి దినచర్య. మారుమూల గిరిజన గ్రామాల్లో ఏ చిన్నఫోన్‌ కాల్‌ చేయాలన్నా సిగ్నల్‌ అందక నానా ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది.

అటువంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో సెల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,459 ఆవాసాలకు సెల్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో.. 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ప్రభత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 2,463 చోట్ల ప్రభుత్వం స్థలాలను సైతం టవర్ల నిర్మాణాలకు అప్పగించింది.

మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ విప్లవాన్ని డిసెంబర్‌ నాటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానేముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఒకేసారి 100 జియో సెల్‌ టవర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలున్నరేళ్ల కాలంలో గిరిజన సంక్షేమాభివృద్ధి దిశగా అడుగులు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. గిరిజనుల సంక్షేమానికి ఇప్పటికే రూ.17,651 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -

గిరిజనులకు 4.88 లక్షల ఎకరాలకు 2.49 లక్షల అటవీ హక్కు పత్రాలు, డీకేటీ పట్టాలు అర్హులైన గిరిజనులకు పంపిణీ చేసిన ట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటు, పాడేరు, పార్వతీపురంలో మెడికల్‌ కళాశాలలు, కురుపాంలో ఇంజనీరింగ్‌ కళాశాల, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది.

కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వీటితో పాటు ఇప్పుడు ఇంటర్నేట్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెల్‌ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గిరిజన ప్రాంతాల్లో సాం కేతిక విప్లవం రానుండటంతో గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. నేటికీ చాలా గిరిజన గ్రామాల్లో సమాచారం అందక గిరిజనులు వెనుకబడే ఉన్నారు.

సెల్‌ఫోన్‌ సేవలు లేకపోవడంతో బాహ్య ప్రపంచానికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. గతంలో ఏదైనా సమాచారం అందాలంటే కాలినడకన వెళ్లి చెప్పాల్సిందే. దీంతో కనీసం ఒకరోజు పట్టేది. మరోవైపు సచివాలయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినా.. గిరిజన ప్రాంతాల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సిగల్స్‌ కోసం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితులు ఎదరవుతున్నాయి. ఇటువంటి సమస్యలను అధి గమించి, సమాచార వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకొంది. మారుమూల గ్రామాల్లో సైతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచార వ్యవస్థను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడడి గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టారు. గిరిజనులు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. రాష్ట్రంలోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం.

అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి, క్షయ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా గిరిజనులు జీవిస్తున్నారు. వీరికి జన సమూహంతో సంబంధ మే లేదు. దగ్గరి పోలికలు అంతకంటే లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృతి భిన్నమైనవి. నల్లమల అటవీ ప్రాంతంలోని జీవనం సాగించే గిరిజనులు సాంకేతిక రంగానికి ఆమడ దూరంలో ఉన్నారు.

అటువంటి ప్రాంతాల్లోనూ డిజిటల్‌ విప్లవం తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఒకే సారి 100 జియో సెల్‌ టవర్లను ప్రారంభించి, రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓ ఎఫ్‌) ద్వారా సెల్‌ టవర్ల ఏర్పాటు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు గాను ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించింది. డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement