Tuesday, May 21, 2024

Delhi | ఢిల్లీలో ఏపీ సర్పంచ్‌ల ధర్నా. నిధులు-హక్కులు ఇచ్చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఏపీ పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల సర్పంచులతో కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టిన వారు మూడు రోజులుగా కేంద్ర పెద్దలను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. శుక్రవారం రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల నాయకత్వంలో సర్పంచులు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల ప్రజల కోసం విడుదల చేసిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ విమర్శించారు. తమ నిధులు, అధికారాలను తిరిగి ఇచ్చేంతవరకు రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమ 16 డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నామని లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement