Sunday, April 28, 2024

Delhi | విమానాల కొనుగోళ్లు, దిగుమతులకు డీజీసీఏ అనుమతి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే ఏ విమానయాన సంస్థ ఇవ్వనంత భారీ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన భారత విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో సంస్థలకు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీపి కబురు చెప్పింది. విదేశాలకు కొనుగోలు ఆర్డర్లు ఇచ్చిన ఈ రెండు సంస్థలకు విమానాల దిగుమతులకు సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా ఈ రెండు విమానయాన సంస్థలు విదేశాల నుంచి విమానాలను ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే దిగుమతి చేసుకున్న విమానాలకు సరిపడా పార్కింగ్ స్లాట్ల లభ్యతను చూపాలని డీజీసీఏ ఆయా విమానయాన సంస్థలకు తెలియజేసింది.

470 విమానాల దిగుమతికి ఎయిరిండియా, 500 విమానాల దిగుమతికి ఇండిగో ఆర్డర్ పెట్టిన సంగతి తెలిసింది. ఇందులో ఎయిర్‌బస్ ఏ 320- నియో ఫ్యామిలీ రకానికి చెందిన 500 విమానాల కొనుగోళ్లకు ఇండిగో ఆర్డర్ ఇవ్వగా.. ఎయిర్‌బస్ ఏ-320 నియోతో పాటు ఏ 350, బోయింగ్ సంస్థకు చెందిన బీ 737 సహా పలు రకాల విమానాలు కలిపి మొత్తం 470 విమానాలకు ఎయిరిండియా ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు విమానాల తయారీ సంస్థలకు – విమానయాన సంస్థలకు మధ్య కుదిరిన కొనుగోలు ఒప్పందానికి డీజీసీఏ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డా. వీకే సింగ్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement