Thursday, May 2, 2024

కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో కలిసి రూ.16.24 కోట్లతో చేపట్టనున్న పలు పనులను ప్రారంభించి, పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. కామేపల్లి మండలం రాయగూడెం గ్రామంలో రూ.3 కోట్లతో రాయగూడెం నుండి రుక్కితండా మీదుగా బండిపాడు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బర్లగూడెం గ్రామం నుండి కొత్తతండా రోడ్డు వరకు రూ.1.05 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం కోయచెలక నుండి కమలాపురం రోడ్డు వరకు రూ.60 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
కామేపల్లి మండలం నెమలిపురి గ్రామంలో నెమలిపురి నుండి నెమలిపురి తండా వరకు రూ.49 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. పింజరమడుగు గ్రామం పింజరామడుగు నుండి నెమలిపురి వరకు రూ.2.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరిచంద్రపురం గ్రామంలో శ్రీరాంనగర్ తండా కు వెళ్లేందుకు రూ.1.75కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు.

మర్రిగూడెం గ్రామం మరిగూడెం నుండి కెప్టెన్ బంజారా వరకు రూ.3.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పాత లింగాల గ్రామం జాస్తిపల్లి నుంచి పాత లింగాల వరకు రూ.3 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోత లింగాల గ్రామం ఖమ్మం – ఇల్లందు రోడ్డు నుండి జాస్తిపల్లి వరకు రూ.1.15 కోట్లతో చేపట్టిన బిటి రెన్యూవల్ పైలాన్ ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, ముఖ్యంగా ప్రజలకు అవసరం అయ్యే మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులే తమ పనితీరుకు నిదర్శమని వారు పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారి సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన కర్తవ్యమని మంత్రి అన్నారు. రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, కాల్వల నిర్మాణం వంటి అనేక పనులను చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఆర్డీవో రవీంద్రనాథ్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement