Monday, June 10, 2024

Delhi | శ్రీముఖలింగం క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి.. కేంద్రానికి ఆలయ ప్రధానార్చకుడి విన్నపాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎంతో విశిష్ట చారిత్రక నేపథ్యంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీముఖలింగం పుణ్యక్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేలా దరఖాస్తు చేయాలని ఆ ఆలయ ప్రధానార్చకులు నాయుడుగారి రాజశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం నిరాహారదీక్ష చేపట్టిన ఆయన, శ్రీముఖలింగం క్షేత్రం అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేయాల్సిందిగా కోరుతూ గతంలో పలుమార్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ప్రధాన మంత్రికి వినతి పత్రాలు అందజేశామని, వారు సానుకూలంగా స్పందించినప్పటికీ తదుపరి చర్యలు కనిపించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీ చేస్తూ ఏడాది క్రితం విడుదల చేసిన రూ. 20 కోట్లు కూడా వెనక్కి మళ్లేలా చేసిందని ఆరోపించారు. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నందున నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు తగిన మౌలిక సదుపాయాలు లేవని, యాత్రికుల కోసం హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. ఆలయ చరిత్ర, వైభవం గురించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంస్థ డైరక్టర్‌కు కీలకమైన పత్రాలను అందజేసినట్టు ప్రధానార్చకులు రాజశేఖర్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement