Sunday, April 28, 2024

ప్ర‌జాద‌ర‌ణ పెరిగినా… బ‌స్సుల సంఖ్య పెంచలే..

ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు వారి ఆదరాభిమానాలను చూరగొనేందుకు సంస్థ ఎండీ రోజుకో కొత్త తరహా నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో ఏ అధికారి కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ”మా ఊరికీ బస్సు” కావాలన్న డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. గతంలో బస్సు నడపాలంటూ గ్రామస్థులంతా కలిసి వినతి పత్రం ఇస్తే ఆదాయాన్ని అంచనా వేసుకున్న అనంతరం నిర్ణయం తీసుకునే వారు. కానీ మారిన కాలాన్ని బట్టి ట్విట్టర్‌లో బస్సు నడపాలని కోరితే వెంటనే ఆ ఊరికి, ప్రాంతానికి బస్సును పంపించేలా ఎండీ చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్యపై ఎవరూ దృష్టి పెట్టడం లేదన్న చర్చ అధికార వర్గాల్లో జోరందుకుంది. బస్సు నడిపించాలంటున్న ఉన్నతాధికారి సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడం లేదని, డిపోలో ఎన్ని బస్సులున్నాయి, ఎన్ని రూట్లలో తిరుగుతున్నాయన్న విషయాలను ఆరా తీయకుండానే నిర్ణీత సమయంలోగా బస్సు నడిపించాలనడంతో అధికారులు హైరానా పడుతున్నారు.

ఆర్టీసీలో ప్రస్తుతం 9700 వరకు బస్సులున్నాయి. వీటిల్లో 3100 బస్సుల వరకు అద్దెవి ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్న బస్సులలో సంస్థ చైర్మన్‌ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 643 బస్సులు స్క్రాప్‌ కింద తీసివేయాల్సినవి కాగా, మరో 1400 బస్సులు ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. అంటే దాదాపుగా రెండు వేల బస్సులు రోడ్లపై తిరగలేనివి ఉన్న సమయంలో కేవలం ఏడు వేల బస్సులతో అందరినీ ఎలా సంతృప్తి పరుస్తామన్న వాదనను అధికారులు తెరపైకి తెస్తున్నారు.

కొత్త డిపోల ఏర్పాటుకు అవరోధాలున్నప్పటికీ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కానీ బస్సులను పెంచకుండా రూట్లను పెంచితే తాత్కా లికంగా ప్రజల్లో ప్రశంసలు పొందినప్పటికీ భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. కరోనా కంటే ముందు ఆర్టీసీలో జరిగిన సమ్మె అనంతరం హైదరాబాద్‌ నగరంలో ఏకంగా వెయ్యి బస్సులను రద్దు చేశారు. ఈ బస్సులనే రోడ్లపైకి ఎక్కించలేని పరిస్థితులలో కొత్త రూట్లలో కొత్త బస్సులు ఎలా నడపాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదే విధంగా వరంగల్‌, నిజామాబాద్‌ లాంటి ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న నగరాలలో సిటీ బస్సులు నడపాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న చర్చ సంస్థలో జోరందుకుంది.

అయితే శివార్లలోని డిపోలలో బస్సుల సంఖ్య స్వల్పంగా ఉంది. ఉదాహరణకు మహేశ్వరం డిపోలో అతి తక్కువ బస్సులుండగా, ఆ ప్రాంతంలోని కాలనీలు, గ్రామాలలో బస్సులకు భారీ డిమాండ్‌ ఉంది. ఇదే తరహాలో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలలోనూ బస్సులు నడపాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బస్సులను సమకూర్చితే తప్ప డిమాండ్‌ను అందుకోలేమని అధికారులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement