Thursday, May 2, 2024

Delhi | బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి.. బీసీ సంక్షేమ సంఘం ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే ప్రధానమంత్రి ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

నరేంద్ర మోడీ డౌన్ డౌన్ – బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న గౌడ్ మాట్లాడుతూ జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. బీసీ జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. 56 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థలలో 23 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమిలేయర్ తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాలలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని, రానున్న వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో బీసీల అంశాలను చేర్చాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement