Thursday, April 25, 2024

రక్షణ సహకారం, మరింత విస్తృతం.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి అంగీకారం

రక్షణరంగం సహా ద్వైపాక్షిక అంశాల్లో మరింతగా పరస్పరం సహకారం అందించుకునేందుకు భారత్‌ – ఫ్రాన్స్‌ అంగీకరించాయి. సుదీర్ఘకాలంగా ఇరుదేశాల మధ్య ఏర్పడిన బంధం కాలపరీక్షలో నెగ్గిందని, మునుముందు కూడా అప్రతిహతంగా కొనసాగుతుందని ప్రకటించాయి. మూడురోజుల ఐరోపా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత పారిస్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం ఎలెసే ప్యాలెస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి నెగ్గి అధికారం చేపట్టిన మేక్రాన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే రక్షణ రంగంలో ఆయుధ సహకారం అందిస్తున్న ఫ్రాన్స్‌, భారత్‌తో కలసి అన్ని రక్షణ విభాగాలలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటాన్ని ప్రస్తావించారు. శక్తి, వరుణ, పెగాసే, డిజర్ట్‌ నైట్‌, గరుడ పేరుతో చేపట్టిన సైనిక విన్యాసాలు మునుముందు కూడా కొనసాగించాలని నిర్ణయించిన ఇరుదేశాలు, మరింత సమగ్రంగా, మరింత సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై విస్తృతంగా చర్చించారు. సైనికచర్య పేరిట రష్యా చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమని, చర్చలు, దౌత్యమార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయన్‌లో అమాయక పౌరులను హతమార్చడాన్ని తప్పుబట్టారు. తక్షణం కాల్పుల విరమణ పాటించాలని, మానవతా సాయం అందించాలని కోరారు. ఈ మేరకు ఇరుదేశాల నాయకులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసిన మోడీ, మేక్రాన్‌ ఈ సమస్యను కలసికట్టుగా ఎదుర్కొంటామని ప్రకటించారు.


ఐరోపా పర్యటన ఫలప్రదం – మోడీ
మూడు రోజుల ఐరోపా పర్యటన అత్యంత ఫలప్రదమైందని భారత ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. పా రిస్‌నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమైన ఆయన టిట్టర్‌లో ఈ మేరకు స్పందించారు. జర్మనీ, డెన్మార్క్‌లో జరిగిన ఇండో-నార్డిక్‌ సమ్మిట్‌, ఫ్రాన్స్‌ పర్యటన అత్యంత ఫలప్రదమైందని ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాలతో వాణిజ్యం, విద్యుత్‌, గ్రీన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, వాతావరణ మార్పులు, రక్షణ సహకారం సహా అనేక ద్వైపాక్షిక అంశాల్లో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చలు సాగాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి టిట్టర్‌లో ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement