Thursday, October 31, 2024

ఖరీఫ్‌ జోరు.. లక్ష్యాన్ని మించి కోటి ఎకరాల దిశగా సాగు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగా కొనసాగుతుంది. వాతావరణం అనుకూలించటంతో పాటు ఈ ఏడాది వరదలు పోటెత్తటంతో నదులు ఉప్పొంగి ప్రవహించటం సాగుకు సానుకూలంగా మారింది. రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా తొణికిసలాడుతుండటంతో చివరి భూములకు సైతం సమృద్ధిగా సాగు నీరందటంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఖరీప్‌ సాగు జోరందుకుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ తొందరగానే ముగిసే అవకాశం ఉండటంతో రబీ ప్రారంభమయ్యే లోపు స్వల్పకాలిక పంటల సాగును ప్రారంభించే అవకాశం ఉందని అంచనా. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు లక్ష్యాన్ని 92.04 లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ ప్రకటించగా కోటి ఎకరాలకు చేరువయ్యే అవకాశం ఉందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా స్థిరీకరించిన ఆయకట్టు పరిధిలో 72 శాతం విస్తీర్ణంలో ఖరీఫ్‌ పంటలు ముగింపు దశకు రాగా.. మిగతా విస్తీర్ణంలోనూ ఆటంకాలు లేకుండా వ్యవసాయ పనులు ముందుకు సాగుతున్నాయి. ఖరీఫ్‌ లో అగ్రస్థానంలో ఉన్న వరి సాగు లక్ష్యం 38.98 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 32 వేల ఎకరాల్లో వరి పంట ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది వరి సాగు 42 లక్షల ఎకరాలకు చేరువకావచ్చని అంచనా. డీఏపీ కోసం అక్కడక్కడా ఇబ్బందులు ఏర్పడినా ఇతర ఎరువులు, విత్తనాల నిల్వలు అవసరమైన మేరకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండటంతో రైతులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

రైతులు కూడా ఈ ఏడాది ఖరీఫ్‌ లో పంటలు పండించటంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. సాధారణంగా ఖరీఫ్‌ లో వరి తరువాత ఎక్కువ విస్తీర్ణంలో పండించే వేరుశెనగకు డిమాండ్‌ తగ్గటంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లోని రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి కేంద్రీకరించారు. పలితంగా వ్యవసాయశాఖ ప్రకటించిన 16.84 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని వేరుశెనగ చేరుకోకపోవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 15.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా ఈ సీజన్‌ లో 13 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని కూడా దాటలేదు. సీజన్‌ పూర్తయ్యే లోపు సుమారు 2 నుంచి 3 లక్షల ఎకరాల వేరుశెనగ విస్తీర్ణం తగ్గవచ్చని అంచనా. రైతులు వేరుశెనగకు బదులు ప్రత్యామ్నాయంగా అపరాలు, నువ్వులు, ఆముదం, పొద్దు తిరుగుడు, సోయాబీన్‌ తదితర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వేరుశెనగ స్థానంలో నువ్వుల పంటకు రైతులు ప్రాధాన్యతిస్తున్నారు. ఖరీఫ్‌ లో నువ్వుల లక్ష్యం 32 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 42 వేల ఎకరాల్లో సాగైంది. రికార్డు స్థాయిలో 45 నుంచి 46 వేల ఎకరాలకు చేరువ కావచ్చని అంచనా. అపరాల సాగు విస్తీర్ణ లక్ష్యం 8.28 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటికే 5 లక్షల ఎకరాలకు చేరువయింది. ఆముదం సాగు లక్ష్యం 59 వేల ఎకరాలు కాగా..ఇప్పటివరకు 65 వేల ఎకరాలకూ, పొద్దు తిరుగుడు లక్ష్యం 9,645 ఎకరాలయితే ఇప్పటివరకు సుమారు 16 వేల ఎకరాల్లో సాగు కావటం విశేషం. సోయబీన్‌ కూడా రికార్డు సృష్టిస్తోంది. ఖరీఫ్‌ లో సోయాబీన్‌ సాగు విస్తీర్ణం కేవలం 3,665 ఎకరాలు కాగా.ఇప్పటివరకు 22 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగయినట్టు- అంచనా. నూనె గింజల సాగు విస్తీర్ణం కూడా ఖరీఫ్‌ లో బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సీజన్‌ లో నూనెగింజల సాగు విస్తీర్ణాన్ని 17.96 లక్షల ఎకరాలుగా నిర్దారించగా..ఇప్పటివరకు 15.5 లక్షల ఎకరాలకు చేరువయింది. దీంతో నూనె గింజల సాగు కూడా లక్ష్యాన్ని మించి పెరగవచ్చని అంచనా. ఖరీఫ్‌ లో వరి, వేరుశెనగ తరువాత పత్తి సాగు లక్ష్యాన్ని 14.70 లక్షల ఎకరాలుగా ప్రకటించగా సుమారు 3 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న 1.7 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, 40 వేల ఎకరాల్లో పసుపు, 50 వేల ఎకరాల్లో ఉల్లి తదితర పంటలను పండిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement