Thursday, May 2, 2024

పంటలు నష్టపోతున్నాం.. క్రాప్‌ హాలిడే ఇచ్చైనా ఏనుగుల బెడద తొలగించండి..

అమరావతి, ఆంధ్రప్రభ: పదిహేనేళ్లుగా తామెదుర్కొంటున్న ఏనుగుల సమస్యను ఒడిశా ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి వరకు రైతులకు పరిహారంతో కూడిన క్రాప్‌ హాలీడే ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఏనుగుల సమస్యను ఆమె ప్రస్తావిస్తూ పది ఏనుగులు తమ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు చెప్పారు. తరుచూ దండెత్తుతున్న ఏనుగులు మొక్కజొన్న, చెరకు పంటలను నాశనం చేయడమే కాక రైతుల బోర్లను ధ్వంసం చేస్తున్నాయన్నారు. ఏనుగుల దాడిలో మృతులకు రూ.5లక్షల పరిహారం ఇస్తున్నప్పటికీ పంట నష్టం అంచనా, పరిహారం ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పంటలకు పరిహారం ఇచ్చినట్లుగానే ఇక్కడ ఇవ్వడంతో పాటు ఐదారు నెలలు పంటలు వేయకుండా ఆపేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈలోగా రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఏనుగుల సమస్య నుంచి తమ ప్రాంతాలను గట్టెక్కించేందుకు ఒడిశా ప్రభుత్వం, అటవీ అధికారులతో ఇక్కడి ప్రభుత్వం, అటవీ అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరిన కళావతి గిరిజన ప్రాంతాల్లోని నివాసాల మీదుగా వెళ్లే హైటెన్షన్‌ విద్యుత్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

పోలీసుల సమస్యలు పరిష్కరించండి..

ఏళ్ల తరబడి పోలీసులు ఎదుర్కొంటున్న లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ సమస్యను పరిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ పోలీసులకు ఏడాది కాలంగా టీఏ బిల్స్‌ చెల్లించడం లేదని, ఈపీఎఫ్‌, జీపీఎఫ్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలోనే ఏపీ పోలీసు శాఖ పనితీరుకు ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయంటే ఐపీఎస్‌ నుంచి క్షేత్రస్థాయిలోని కానిస్టేబుల్‌ వరకు పని చేయడమే కారణమన్నారు. ఎవరి స్థాయిలో వారు సమర్థవంతమైన విధులు నిర్వహించడం వలనే ఇది సాధ్యపడుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే, సౌకర్యాల విషయంలో అధికారులకు ఫర్వాలేనప్పటికీ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, ఆపై క్షేత్రస్థాయి అధికారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీపీఎఫ్‌ పెండింగ్‌ వలన పిల్లల చదువు, పెళ్లిళ్లకు వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరారు.

ఈనాం భూముల సమస్య పరిష్కరించండి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈనాం భూముల సమస్యను పరిష్కరించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను కోరారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32వేల ఎకరాల ఈనాం భూములు ఉన్నట్లు తెలిపారు. గతంలో ఆలయాల్లో విధులు నిర్వహించే రజకులు, మరికొందరికి దాతలు భూములను ఈనాంగా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఏళ్ల కిందటనే పలు చేతులు మారాయని ఆయన తెలిపారు. అయితే 2013లో అప్పటి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఈనాం భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వలన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నారు. దీంతో ఐదు లక్షల మంది ఇబ్బందులు పడుతున్నట్లు సామినేని తెలిపారు. గతంలో మాదిరిగానే వీటి క్రయ విక్రయాలకు అనుమతించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వండి..

అగ్రహారం భూములకు పట్టాదార్‌ పాసు పుస్తకాలు మంజూరు చేయాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. తన నియోజకవర్గంలో 17,500 వరకు అగ్రహారం భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకుల్లో పెట్టుకొని రుణం పొందేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయా భూములపై రైతులకు హక్కులు కలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేలు బుర్రా మధుసూధన్‌ యాదవ్‌, డాక్టర్‌ సూర్యనారాయణ రెడ్డి, గొర్ల కిరణ్‌ కుమార్‌, జోగారావు, అప్పలనాయుడు, శంకరరావు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, రెడ్డి శాంతి, కిలారు రోశయ్య, అన్నా రాంబాబు తదితర ఎమ్మెల్యేలు తమ నియోజకర్గాలు, జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement