Friday, April 26, 2024

మరోసారి వైరస్ ఉధృతికి సిద్ధంగా ఉండాలి: నీతి ఆయోగ్

దేశ ప్రజలందరూ మరోసారి వైరస్‌ ఉధృతికి సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ హెచ్చరించారు. వైరస్‌ ముప్పును ఎదుర్కోవడానికి రాష్ట్రాల సమన్వయంతో జాతీయస్థాయిలో సన్నద్ధతను, మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని ఆయన సూచించారు. కఠిన ఆంక్షలు విధించాలని, ప్రజలందరూ నిబంధనలను పాటించాలని కోరారు. సెకండ్‌ వేవ్‌ తీవ్రతను ప్రభుత్వం అంచనా వేయలేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. సెకండ్ వేవ్ వస్తుందని పదేపదే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైరస్‌ ఎక్కడికీ పోలేదని.. ఇతర దేశాలు కూడా పలు వేవ్‌లను చూస్తున్నాయని చెప్పామని వీకే పాల్‌ గుర్తుచేశారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ ముప్పుందని, కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రధాని మోదీ మార్చి 17న హెచ్చరించారని గుర్తుచేశారు. సెకండ్‌వేవ్‌లో ఈ స్థాయి కేసులు వస్తాయని తెలుసని, అలాగే వైరస్‌ మళ్లీ విజృంభిస్తుందని కూడా తెలుసని చెప్పారు. సెకండ్‌ వేవ్‌కు డబుల్‌ మ్యుటెంట్‌ (బి.1.617) కారణమని కేంద్రం ఒప్పుకుందని.. ఈ విషయాన్ని గురువారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారని పేర్కొన్నారు. బి.1.617లో కొత్త రకాలైన బి.1.617.1, బి.1.617.2 ఇంకా వేగంగా వ్యాప్తి చెందేవని, ప్రాణాంతకమైనవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement