Thursday, April 25, 2024

Delhi | రేపు కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుండడంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైంది. అదే సమయంలో మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో ఇప్పటికే కవిత గత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు తొలుత 7 రోజులు, ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీ పొడిగించింది. మద్యం కుంభకోణంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూర్చిన రూ. 100 కోట్లు ముడుపులతో పాటు మద్యం వ్యాపారం ద్వారా ఇండో స్పిరిట్స్ సంస్థ పొందిన లాభం నుంచి కవితకు అందిన వాటాపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది.

- Advertisement -

ఈ క్రమంలో కవిత ఆడపడచు అల్లుడు మేక శరణ్ రెడ్డి పాత్రపై కవితను ప్రశ్నించినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత తన సమీప బంధువులతో జరిపిన వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని సమాధానమిస్తున్నారని కూడా ఈడీ ఆరోపించింది. అనంతరం కవిత ఆడపడచు నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా కవితను మరింత ప్రశ్నించాలని కోరే అవకాశం ఉంది.

అలాగే ఇదే కేసులో అరెస్టయి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం సమాంతరంగా ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించ లేదు. కానీ కవితను ఆమెకు ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబు, ఇండోస్పిరిట్స్ సంస్థ అధినేత సమీర్ మహేంద్రు సహా మరికొందరు నిందితులతో కలిపి ప్రశ్నించినట్టు తెలిసింది. తదుపరి కేజ్రీవాల్‌తో కలిపి ప్రశ్నించాలని చెబుతూ కస్టడీ పొడిగింపు కోరనున్నట్టు సమాచారం.

మరోవైపు కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరఫున వాదనలు బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికల వేళ వరుసగా జరుగుతున్న అరెస్టులపై కవిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షసాధింపు ఉందంటూ ఆరోపించారు. ఈ అంశాలను ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావిస్తూ.. చట్టంలో కొన్ని సెక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయనున్నట్టు తెలిసింది. విచారణకు సహకరిస్తున్నారని, బెయిల్ పై విడుదల చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమే లేదని కూడా వాదించే అవకాశం ఉంది.

ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేయకుండా కస్టడీ పొడిగిస్తే మళ్లీ ఈడీ కార్యాలయానికి, లేనిపక్షంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇదే కేసులో 13 నెలల క్రితం అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా పలువురు ఇతర నిందితులు కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. అప్రూవర్లుగా మారి దర్యాప్తు సంస్థకు సహకరిస్తూ వాంగ్మూలాలు ఇచ్చినవారికి బెయిల్ లభించింది.

కవితను కలిసిన భర్త అనిల్, ఎంపీ గాయత్రి రవి

కస్టడీలో భాగంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్న కవితను సోమవారం సాయంత్రం ఆమె, భర్తి అనిల్, న్యాయవాది మోహిత్ రావుతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కలిశారు. అదే సమయంలో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన సతీమణి కూడా అక్కడికి వచ్చారు. ఆదివారం రాత్రి కవితను ఆమె భర్తతో పాటు పిల్లలిద్దరూ కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement