Saturday, May 4, 2024

10వేలకు చేరువలో పత్తి ధర.. ఆరంభంలోనే అత్యధిక ధర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: క్వింటాల్‌ పత్తి ధర రూ 10 వేలకు చేరువలో ఉంది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో  పత్తికి మార్కెట్‌లో అత్యధిక ధర పలుకుతోంది. సాధారణంగా పత్తిని రైతులు తెల్ల బంగారంగా పేర్కొంటారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి బేళ్ల ధరలు ఆశాజనకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి పత్తికి రికార్డుస్థాయి ధర పలుకుతోంది. అన్ని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధర ప్రారంభ పాటనే రూ.8500కు పైగా పలుకుతుండడంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిస్తోంది. రాష్ట్రంలోని ఎనమాముల , జమ్మికుంట, స్టేషన్‌ ఘనపూర్‌ వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధర క్వింటాల్‌కు రూ. 9వేల దాకా పలుకుతోంది.

మరో వారం, పది రోజుల్లో ధర రూ.10వేలను తాకనుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత సీజన్లోనూ పత్తి ధర పరుగులు పెట్టింది. గత సీజన్‌లో కరీంనగర్‌ జి ల్లా జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి గరిష్టంగా రూ.14వేల దాకా పలికింది. అయితే ఈ ఏడాది కూడా ప్రారంభంలోనే మంచి ధర పలుకుతుండడంతో సీజన్‌ చివరినాటికి పత్తి మరోసారి రికార్డు సృష్టించనుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. అయితే విస్తారంగా కురిసిన వర్షాలకు పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. 20 రోజులుగా వాతావరణం సహకరిస్తుండడంతో పత్తి ఏరే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పత్తి రావటం క్రమంగా పెరుగుతోంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా పత్తి ఏరివేత కొనసాగనుందని రైతు సంఘాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం 20 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పత్తిలో తేమశాతం తగ్గి నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పత్తికి ఎక్కువ ధరను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది పత్తి సీజన్‌ ఆరంభం నవంబరులోనే అధిక ధరలు పలుకుతుంటే … మే నాటికి ధర ఇంకా పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని వరంగల్‌ ఎనమాముల, జూలూరుపాడు తదితర మార్కెట్లకు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వచ్చి ఇక్కడి పత్తిని కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తెలంగాణ పత్తిలో తేమశాతం తక్కువగా ఉండడం, బుగ్గలు బుగ్గలుగా పత్తి ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులను ఆకట్టుకుంటోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement