Monday, April 29, 2024

Big Story | ఉచిత విద్యుత్‌పై కుట్రలు.. తెలంగాణ విద్యుత్‌ అవసరాకు పెను సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణపై రోజుకో కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధికి ఆంటకాలు సృష్టించేలా కుటిల నీతితో కావాలనే ఆంక్షలు పెరుగుతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. అప్పుల ఆంక్షలనుంచి మొదలుకొని, చట్టాలకు ఆమోదముద్ర వేయకుండా అడ్డుకోవడం, ఆర్ధిక సాయాల నిలిపివేత వంటివాటితోపాటు కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన నూతన విద్యుత్‌ చట్టంతో తెలంగాణ రైతుకు అన్యాయం జరుగుతున్నదన్న ఆందోళనలకు తోడు సింగరేణిపై కుట్రలు తెెలంగాణ ఎదుగుదలకు శాపంగా పరిణమించాయి.

- Advertisement -

ప్రాజెక్టులు పెరిగే…భూగర్భ జలాలతో బోరు బావులకు డిమాండ్‌…

2004 నుంచి 14 వరకు పదేళ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై ఉమ్మడి సర్కార్‌ రూ.38,405కోట్లు ఖర్చే చేస్తే, గడచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం రూ.1.69లక్షల కోట్లను వెచ్చించింది. 75ఏళ్లలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరుగుదల శాతం 7.7కాగా, ఎనిమిదేళ్ల తెలంగాణ పాలనలో 117శాతంగా పెరిగింది. గడచిన తొమ్మిదేళ్లలో భూగర్భ సఘటు జలమట్టాల పెరుగుదల 4.14మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టుల పూర్తితో తెలంగాణలో పుష్కలంగా జల వనరులు అందుబాటులోకి రావడంతో దశాబ్దకాలంగా ఎండిన బోరుబావుల్లో సైతం ఊటలు మొదలయ్యాయి.రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి ఉబికి వస్తున్న నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం రికార్డుకు చేరుకున్నది.

ఫలితంగా చెరువులు, ప్రాజెక్టుల కిందే కాకుండా బోరుబావుల కింద ఉండే చిన్న కమతాల్లో 55 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలంగా మారింది. ఈ భూమిలో ప్రధానంగా వరితో పాటు వేరుశనగ, చెరుకు, ఉల్లి, కూరగాయలు పండిస్తారు. దాదాపు బోరుబావులున్న రైతులంతా చిన్న కమతాలు కలిగిన వారే కావడంతో సమీప భవిష్యత్తులో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోంది. మళ్లి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే… గతంలో పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన నూతన విద్యుత్‌ చట్టం అమలైతే, ఆ ప్రభావం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా తెలంగాణాపైనే ఉంటుందని సామాజిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ టార్గెట్‌.. ఎందుకంటే ఉచిత విద్యుత్‌ ఇక్కడే..

తెలంగాణ రైతుల కోసం 24 గంటల పాటు వ్యవసాయ రంగానికి నిరంతర, నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్న కేవలం ఒకేఒక్క రాష్ట్రం కావడంతో కేంద్రం ఈ పథకం అమలుపై కొంత వ్యతిరేకతతో ఉంది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 26 లక్షల పైచిలుకు బోరుబావులున్నాయి. గత ఎనిమిదేళ్ళ కాలంగా ఈ పంపుసెట్లన్నింటికీ పూర్తి ఉచితంగా ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేస్తోండగా, వీటిపై 26 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. వీరంతా దాదాపు చిన్న, సన్నకారు రైతులే. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేవాలని భావిస్తున్న నూతన విద్యుత్‌ చట్టం ద్వారా రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల మనుగడ ఎలాగున్నా, ఉచిత విద్యుత్‌ ఎత్తివేసే పరిస్థితి వస్తుండడంతో ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగులబోతోంది.

భారమిలా.. రైతుకు ఉరే..

ఎలాగంటే ప్రతి బోరుబావి పంపుసెట్టు సరాసరిగా 5 హెచ్‌పీ మోటారు కలిగివుంటే, విద్యుత్‌ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి గంటకు 3.37 యూనిట్ల కరెంటు ఖర్చవుతుంది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉన్నా… ప్రతి రైతు నిరంతరం వినియోగించుకునే అవకాశం లేదు కాబట్టి సరాసరిగా 12 గంటలు తప్పనిసరిగా వాడుకుంటారు. ఆ ప్రకారం ప్రతిరోజూ 40.44 యూనిట్ల విద్యుత్‌ను ఒక్కో రైతు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. ప్రతి నెలా ఒక్కో రైతు సరాసరిగా 1213 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన పంట వరి కావడంతో బోరుబావుల క్రింద 99శాతం రైతులు ఈ పంటనే సాగు చేస్తారు. పొలాల్లో 4 నెలల నుంచి 5 నెలల వరకు ఇదే తరహా వినియోగం ఉంటుంది. నాలుగున్నర నెలలకు లెక్కగట్టినా ప్రతి సీజన్‌లో ఒక్కో రైతు సుమారుగా 5459 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తారు.

ఒక్కో యూనిట్‌ ధర సరాసరిగా రూ.4 చొప్పున లెక్కగట్టినా రూ.21,837 వరకు ప్రస్తుతం రైతుకు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న కారణంగా బోరుబావులపైనే జీవనాధారం పొందుతున్న 26 లక్షల రైతు కుటుంబాలకు సాగు వ్యయంలో సగానికి పైగా ఆర్థిక భారం తగ్గుతోంది. పారిశ్రామిక రంగానికి ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌ను అమలుచేస్తూ ఎక్కువ ధరలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ప్రభుత్వం, ఆ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి సర్ధుబాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్‌ చట్టంతో ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు విధిగా రీడింగ్‌ మీటర్లు బిగించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో కొనసాగుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలన్నీ కేంద్రం పరిధిలోకి వెళితే ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి అవకాశం ఉండదు.

ఒకవేళ ఇవ్వాలంటే ఆ విద్యుత్‌ బిల్లులన్నీ లెక్కేసి ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆపరేటర్ల చేతుల్లోకి వెళితే వసూలు చేసే ఛార్జీలు కూడా నియంత్రణ లేకుండా పోతాయి. అంతటి ఆర్థిక భారాన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఛార్జీల ప్రకారం చూస్తే ప్రతి సీజన్‌లో ఒక్కో రైతు కుటుంబం నుంచి ప్రతినెలా రూ.21,837 మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లులను చెల్లించే ఆర్థిక స్థోమత రైతు కుటుంబాలకు లేదన్నది స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement