Friday, May 10, 2024

Delhi | దేశ గౌరవాన్ని మంటగలిపే పార్టీ కాంగ్రెస్ : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధాననమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కు బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని విమర్శించారు. సోమవారం కిషన్‌రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎవరు ఎవరికి బీ టీమో ప్రజలకు బాగా తెలుసునన్నారు. పార్టీ నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.తెలంగాణలో బీజేపీ ఖతం అంటున్న వారి పరిస్థితేంటో.. నాలుగు నెలల్లో ప్రజలు తేలుస్తారని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాని నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేయలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఇరు పార్టీలు మంత్రిపదవులు పంచుకోవడం తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ తో ఏనాడూ పొత్తు పెట్టుకోలేదన్న కిషన్ రెడ్డి, బీజేపీకి బీఆర్ఎస్ ఎంత దూరమో.. కాంగ్రెస్ కు బీజేపీ అంతేదూరమని స్పష్టం చేశారు.

- Advertisement -

కుటుంబ పాలనకు ఆద్యులైన రాహుల్ కుటుంబానికి బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని నిలదీశారు. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటారని, అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు. సైనికులు, దేశ గౌరవాన్ని మంటగలిపే కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించి పబ్బం గడుపుతారని నొక్కి చెప్పారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌కు కుర్చీ కోసం ఆరాటమే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అందుకే ఆ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అడ్రస్ లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఉమ్మడి పౌరస్మృతి మీద కాంగ్రెస్, రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉచితాలు, సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకునే, అధికారం కోసం దేనికైనా దిగజారే కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏ ఒక్కటేనన్న కిషన్‌రెడ్డి, ఈ రెండు పార్టీలూ అవినీతిలో నిండా మునిగిన కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ నెల 8న వరంగల్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు, రూ.5,500 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నామని, భవిష్యత్‌లోనూ ఇదే అనుబంధం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ దిశలో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement