Sunday, April 28, 2024

అలా ఎందుకు చేశారో చెప్పాలే.. కేవీ థామస్, జాఖర్​కు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీస్

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ పార్టీ సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఇవ్వాల ఢిల్లీలో భేటీ అయ్యింది. పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి లీడర్లపై వచ్చిన ఆరోపణలపై ఈ భేటీలో చర్చించారు. కాగా, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఉద్దేశించి చేసిన ఆరోపణలపై పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సోమవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతేకాకుండా ఏప్రిల్ 9న కేరళలో సీపీఐ(ఎం) నిర్వహించిన సెమినార్‌కు హాజరైనందుకు కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్‌కు కూడా క్రమశిక్షణా కమిటీ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులకు వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరినట్టు కమిటీ మెంబర్​ తారిఖ్ అన్వర్ చెప్పారు.

నోటీసులు ఎందుకు ఇచ్చారంటే..
కేరళ లీడర్ కేవీ థామస్‌కు రాజ్యసభ సీటు నిరాకరించినప్పటి నుండి పార్టీపై ఆయన కాస్త నిరాసక్తంగా ఉన్నారు. ఇక పంజాబ్ సీఎం పదవిని విస్మరించారని సునీల్ జాఖర్ పార్టీ నేతలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై సునీల్ జాఖర్ విమర్శలు గుప్పించారు. భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్‌ను చిత్తు చేసింది. మరోవైపు, ఏప్రిల్ 9న కన్నూర్‌లో సీపీఐ(ఎం) నిర్వహించిన సెమినార్‌కు కేవీ థామస్ హాజరయ్యారు. సెమినార్‌లో పాల్గొన్న నేపథ్యంలో థామస్‌ను వెంటనే తొలగించాలని కేరళకు చెందిన కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

కేరళ కాంగ్రెస్ చీఫ్ కె. సుధాకరన్ ఆ రాష్ట్రంలోని ఇద్దరు నేతలను సీపీఎం సెమినార్లో పాల్గొనవద్దని ముందే తెలియజేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దీంతో సెమినార్‌కు హాజరు కావడానికి కేరళ సీనియర్ లీడర్ శశి థరూర్ నిరాకరించగా, కెవి థామస్ మాత్రం వారి రూల్స్ని పట్టించుకోకుండా సీపీఎం సెమినార్కు అటెండ్ అయ్యారు. ప్రతిపాదిత K-రైల్ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్, సీపీఎం విభేదిస్తున్న సమయంలో ఇది జరిగింది. అయితే.. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నోటీసుపై థామస్ స్పందిస్తూ తాను ఎప్పటికీ ‘కాంగ్రెస్‌ వ్యక్తి’గానే ఉంటానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement