Friday, May 17, 2024

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుపై గందరగోళం.. ఫీజుల జీవో ఇంకా రాలే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముందు నుంచి అంతా గందరగోళంగానే మారింది. రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అయినా ఇంకా ఇంత వరకు ఇంజనీరింగ్‌ ఫీజులు ఫైనల్‌ కాలేదు. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల కాలేదు. ఇంజనీరింగ్‌ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఈనెల 3వ తేదీన 20 కాలేజీలను విచారించి గత కొద్ది నెలలుగా సాగుతున్న కొత్త ఫీజుల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చింది. మొత్తం 173 ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త ఫీజులను ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 6న విద్యార్థులకు సీట్లను కేటాయించారు. అతర్వాత విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజులను కూడా చెల్లించారు. పెంచిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆన్‌లైన్‌లో గత పాత ఫీజులనే అప్పట్లో చెల్లించారు. అదే నెల 28 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ మొదలు కావాల్సి ఉంది. ఫీజులు ఖరారు కాకపోవడంతో ఈనెల 11కు కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. పాత ఫీజులనే ఈ ఏడాది అమలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ అనధికారికంగా అప్పట్లో చెప్పడంతో దాదాపు 81 కాలేజీలు హైకోర్టును సంప్రదించి పెంచిన ఫీజులను వసూలు చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నాయి. ఫీజులు భారీగా పెరగడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లి టీఏఎఫ్‌ఆర్‌సీ ఈ నెలలో కాలేజీలతో విచారించి ఫీజులను ఖరారు చేసింది.

దీనికి సంబంధించిన దస్త్రాన్ని ప్రభుత్వానికి ఇటీవలే అందింది. ఈనెల 11 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ ఉండడంతో ఈలోపే ఫీజుల జీవో వెలువడుతుందని విద్యావర్గాలు భావించాయి. ఇది వస్తేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. కానీ మంగళవారం సాయంత్ర వరకు కూడా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా కింద వసూలు చేస్తున్న ఫీజులు ఒక రకంగా హైకోర్టుకు వెళ్లిన సుమారు 81 కాలేజీలు వసూలు చేయాల్సిన ఫీజులు మరో రకంగా ఉన్నట్లు విద్యావర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పలు కాలేజీలు ఫీజులు రెండు, మూడు సార్లు మారాయి. ప్రస్తుతం రెండో దశ కౌన్సెలింగ్‌ నడుస్తుండటంతో సగం కాలేజీల్లో ఫీజులు ఒక రకంగా సగం కాలేజీల్లో ఫీజులు మరో రకంగా ఉండడం, పాత ఫీజులా? లేక కొత్త ఫీజులా? అసలు ఏ ఫీజులను చెల్లించాలి, ఏ కాలేజీలో చేరాలనే దానిపై విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జీవో కూడా…

కొత్త ఫీజులకు సంబంధించిన జీవో మాత్రమే కాదు మారిన ఫీజులకు అనుగుణంగా అర్హులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉత్తర్వులు కూడా జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పది వేలలోపు ర్యాంకు ఉన్న అర్హైలైన అన్ని కేటగిరీల వారికి వంద శాతం ఫీజు చెల్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. గతంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన కనిష్ట ఫీజు రూ.45 వేలు కాగా గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలు ఉంది. దీనిప్రకారంగా గతంలో రూ.35 వేలుగా ఉన్న కనిష్ట ఫీజుకు అదనంగా రూ.10 వేలు పెరగడంతో ప్రభుత్వంపై భారం పడనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత
వున్న విద్యార్థులందరికీ కూడా రూ.10వేల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా కొత్త ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement