Friday, May 3, 2024

ఇంట్లో పరిస్థితులే బయట ప్రతిబింబిస్తాయి.. మహిళలకు రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంట్లో జరిగేదే బయట జరుగుతుందని, రాజకీయాల్లోనూ అదే ప్రతిబింబిస్తుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన “షి ద లీడర్”-ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ సహా పలువురు రాజకీయ, సాహిత్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

‘షి ద లీడర్’ పుస్తకంలో మొత్తం 17 మంది మహిళా నేతల గురించి రాయగా, అందులో కల్వకుంట్ల కవిత ఒకరు. సామాజిక సమానత, మహిళాభ్యున్నతి సహా సమాజంలో వివిధ రంగాల్లో అపారమైన కృషితోపాటు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న 17 మంది ప్రముఖ మహిళా నేతల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. 17 మంది ప్రముఖ నాయకురాళ్లలో కవితతో పాటు సోనియా గాంధీ, సుచేత కృపలానీ, జయలలిత, వసుంధర రాజే, షీలా దీక్షిత్, మాయావతి, ప్రతిభా పాటిల్, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, బృందా కారత్, అంబికా సోనీ, స్మృతి ఇరానీ, సుప్రియ సూలే, కనిమొళి ఉన్నారు.

మనీష్ తివారీ, జాన్ బ్రిట్టాస్‌తో చర్చావేదిక పంచుకున్న కవిత పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలంటే వారికి రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా అభ్యదయ భావజాలం, విప్లవ భావజాలం కలిగిన సీపీఐ(ఎం) వంటి రాజకీయ పార్టీల పొలిట్ బ్యూరోలోనే మహిళలకు తగినంత ప్రాతినిథ్యం ఎందుకు లేదంటూ వచ్చిన ప్రశ్నకు జాన్ బ్రిట్టాస్ సమాధానం చెప్పిన తర్వాత కవిత తన వాదన వినిపించారు. మన ఇళ్లళ్లో ఏం జరుగుతుందో, బయట కూడా అదే జరుగుతుందని, రాజకీయ పార్టీల్లోనూ అదే ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇంట్లో మహిళకు అన్నింటా సమాన అవకాశాలు కల్పించినపుడు బయట వాతావరణం కూడా అలాగే మారుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ అయినా, విప్లవ భావాలు కల్గిన సీపీఐ(ఎం) అయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయినా.. మరే పార్టీ అయినా సరే మహిళల ప్రాతినిథ్యం పెరగాలంటే రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అన్నారు. అనివార్యత ఏర్పడినపుడే మహిళ ప్రాతినిథ్యం పెరుగుతుందని అన్నారు. కార్పొరేట్ రంగంలో కొన్ని చోట్ల మహిళలకు తగిన ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపించినా.. బోర్డ్ రూమ్‌లో మళ్లీ లింగ వివక్ష కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మహిళలకు ప్రాతినిథ్యం కల్పించిన చోట ఉద్యోగులుగానే చూస్తారు తప్ప యాజమాన్యంలో వారికి ప్రాధాన్యత ఇవ్వరని కవిత తెలిపారు.

- Advertisement -

ప్రపంచంలోనే యువ శక్తి ఎక్కువ ఉన్న మన దేశంలో చదువుకున్న మహిళలు ఎటు వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారు.. ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై గతంలో కొంతమంది ప్రముఖ నేతలు “వీళ్లంతా ఉద్యోగాలు చేస్తే ఇంట్లో రోటీ ఎవరు చేస్తారు?” అంటూ వ్యాఖ్యానించారని కవిత గుర్తుచేశారు. దీన్ని బట్టే మహిళల పట్ల వారికున్న భావన ఏంటో స్పష్టమవుతుందని అన్నారు. చివరకు న్యాయం చెప్పే న్యాయవ్యవస్థలో ఎంత మంది మహిళలు ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ఏ రంగంలోనైనా సరే అనివార్యత ఏర్పడితే తప్ప మహిళలకు చోటు దొరకదని కవిత అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చే మహిళలు మహిళా సమస్యల గురించి, పిల్లల పెంపకం గురించి మాత్రమే మాట్లాడాలి అన్న భావన కూడా సరికాదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళలపై ఏర్పరచుకున్న ఈ భావన సరికాదని అన్నారు. మహిళలు అనేక రంగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని, కష్టతరమైన పన్నుల వసూళ్లు చేస్తూ రాణిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రతి చోట, ప్రతి అంశంలో మహిళకు పరిమితులు ఉంటాయని కవిత చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. చదువుకున్న యువత ఓటింగ్ కి దూరంగా ఉంటోందని ఆమె అన్నారు. బాగా చదువుకున్నవారే ఇలా ఉంటే ఇక ఓటేసేది ఎవరు.. గెలిపించేది ఎవరిని అని ప్రశ్నించారు. అందుకే ఓటింగ్ తప్పనిసరి చేయాలన్న వాదనను తాను సమర్థిస్తానని అన్నారు. అలాగే రాజకీయాల్లో ఉన్నవారి నేర చరిత్ర అంటూ నివేదికలు ఇస్తూ ఉంటారని, రాజకీయాల్లో ఉన్నందుకు ధర్నాలు చేయాల్సి వస్తుందని, ఆ క్రమంలో కేసులు పెడతారని, ఆ కేసుల సంఖ్య చూపించి నేర చరిత్ర అనడం సరికాదని అన్నారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కోవారితో పాటు పోల్చి చెప్పడం సమంజసం కాదన్నారు.

మేనిఫెస్టోలో పెట్టారు.. కానీ బిల్లు పాస్ చేయలేదు..కేంద్ర ప్రభుత్వంపై కవిత విమర్శలు
పుస్తకావిష్కరణ కార్యక్రమం, చర్చ ముగిసిన తర్వాత కవిత తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లును సంపూర్ణ మెజారిటీ ఉన్న లోక్‌సభలో ఇప్పటి ప్రభుత్వం పాస్ చేయకపోవడం మహిళలపై భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్లను ప్రస్తావించిన బీజేపీ బిల్లు పాస్ చేయకపోవడం బాధాకరమని అన్నారు. మహిళలకు ఏ స్థాయిలోనూ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. మహిళలు రాజకీయాల్లో రావాలంటే సమాజంలో.. ప్రజల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

అలాగే దేశంలో పనిచేసే మహిళలు రోజురోజుకూ తగ్గుతున్నారని తెలిసిందని, మహిళా శ్రమ శక్తిని మరింత పెంచడం ఎలా అన్న విషయం సహా అనేకాంశాలపై ఈ పుస్తకావిష్కర కార్యక్రమంలో చర్చించినట్టు వెల్లడించారు. దేశంలో ఎంపీ సీట్లను పెంచి, పెంచినవాటిలో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలంటూ తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. మహిళలకు స్థానాలను కేటాయించినప్పుడు సహజంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి కోటా కూడా అమలవుతుందని, ఆ మేరకు మహిళా రిజర్వేషన్లలోనూ కోటా అమలవుతుందని తెలిపారు. ఈ లెక్కలు తేల్చడం కోసమే ఓబీసీ కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అదే విధంగా రాజకీయాల్లోనూ రాణించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement