Friday, October 11, 2024

TS: భాగ్యలక్ష్మీ ఆలయానికి రండి.. లెక్కలు తేల్చుకుందాం.. కేటీఆర్ కు బండి సవాల్

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు ఎందుకు రాకూడదు? కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలిచ్చింది. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అంతెందుకు? తెలంగాణకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్, టైం ఫిక్స్ చేయండి. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు కిషన్ రెడ్డిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా… నువ్వో లేక మీ అయ్యో బహిరంగ చర్చకు సిద్ధమా? ఇదే ఎన్నికల రెఫరెండంగా తీసుకుందాం.… నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

ప్రధానిని విమర్శించే కనీస అర్హత కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లేకుంటే నీకున్న అర్హత ఏంది? మోడీ, కిషన్ రెడ్డి నీ లెక్క అయ్య పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు.. పదవులు సంపాదించలేదు? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అవమానించిన మూర్ఖుడివి నువ్వు’’ అంటూ దుయ్యబట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తా వద్దనున్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బాపూజీ సేవలను స్మరించుకున్నారు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement