Monday, April 29, 2024

Big Story | అసెంబ్లీ ఎన్నికలకోసం.. మరో బ్రహ్మాస్త్రం రెడీ చేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి): రైతుబంధు పథకాన్ని ప్రారంభించి కర్షకుల మనసులను దోచుకుని 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రెండోసారి అధికారాన్నిహస్తగతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి) ముచ్చటగా మూడోసారి విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించేందుకు భారీ కసరత్తు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు, రైతు భీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిన గులాబీ దళపతి ఈ పథకాలకన్నా మిన్నయిన మరో పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నారని భారాస వర్గాలు చెబుతున్నాయి.

కొత్త పథకం ఏంటన్నది బయటకు పొక్కకుండా సీఎం కేసీఆర్‌ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ పథకానికయ్యే ఖర్చు, లబ్దిదారుల వివరాలు ఇత్యాది అంశాలపై గత నాలుగైదు నెలలుగా మేధోమధనం చేసిన కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి ప్రకటించనున్న ఈ వినూత్న కొత్త కార్యక్రమానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. గురువారం(9న) జరిగే మంత్రిమండలి భేటీలో ఈ అంశానికి సంబంధించిన వివరాలను కేసీఆర్‌ తన సహచర మంత్రులతో పంచుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రైతుబంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్‌, ధాన్యం కొనుగోళ్లు ఇలా దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం పథకాలను ప్రారంభించి శభాష్‌ అనిపించుకుంటున్న కేసీఆర్‌ ఈ కొత్త కార్యక్రమం ప్రకటిస్తే ప్రపంచంలోనే ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

- Advertisement -

అమ్ముల పొదిలో కొత్త అస్త్రం..

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అమ్ముల పొదిలో నుంచి కొత్త అస్త్రాన్ని కేసీఆర్‌ బయటకు తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యూహంతో ఆయన అసెంబ్లి ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. దళిత బంధు పథకాన్ని ప్రకటించి హుజురాబాద్‌ ఉప ఎన్నికలో లబ్ది పొందాలని ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ దఫా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీ జనం నోళ్ళలో నానేలా కొత్త పథకం ఉండబోతోందని పార్టీ నేతలంటున్నారు. ఈ కొత్త పథకం ఎన్నికలతో సంబంధం లేకుండా అమల్లోకి తీసుకురావాలా లేక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలా అన్న అంశంపై కేసీఆర్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని, ఈ అంశానికి సంబంధించి ఆయన ఇప్పటికే జాతీయ రైతు సంఘాల నేతలు, రాజకీయ కోవిదులు, ఆయా వర్గాల ప్రముఖులతో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ డిసెంబర్‌ మధ్యలో అసెంబ్లిd ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే ఈ కొత్త పథకాన్ని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లాలా లేక ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి అమలు చేయాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.

వ్యవసాయ భూమి పట్టా పాస్‌బుక్‌ ఉన్న ప్రతి కర్షకుడుకి ఈ కొత్త స్కీమ్‌ అమలయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గరున్న రైతుబంధు లెక్కల ప్రకారం 68 లక్షల రైతు కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలన్నిటికీ ఈ కార్యక్రమం అమలు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023-24 వార్షిక బడ్జెట్‌లో ఈ కొత్త పథకం ప్రస్తావన చేయలేదు.. నిధులు కేటాయించలేదు. దళిత బంధు పథకాన్ని కూడా బడ్జెట్‌లో పెట్టకుండానే ప్రారంభించారు. అంతకుముందు 2018 ఎన్నికల ముందు అమలు చేసిన రైతు బంధు పథకాన్ని సైతం బడ్జెట్‌లో పెట్టలేదు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశ వ్యాప్తంగా భారాసను విస్తరించి వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. ఈ కొత్త పథకం జాతీయ రాజకీయాల్లో ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తునట్టు సమాచారం. దేశంలో ఎక్కడా లేని పథకాన్ని ప్రారంభిస్తే భారాస, కేసీఆర్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతుందని పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈ పథకంతో రాష్ట్రంలో భారాస తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement