Sunday, May 19, 2024

శుద్ధ ఇంధనం కొనాల్సిందే.. రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాలు

ఇక రాష్ట్రాలు తమ విద్యుత్‌ డిమాండ్‌లో 25 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని అందించాల్సిందే. అంతర్జాతీయంగా పర్యావరణ నియంత్రణలో భాగంగా గ్లాస్గో ఒప్పందానికి అనుగుణంగా భారత్‌ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకుని వినియోగించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రాలు 25 శాతం తమ డిమాండ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను వాడాల్సి ఉంటుంది. దీన్ని ఈ దశాబ్దాంతానికి 43 శాతానికి పెంచాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిందే. సోలార్‌, విండ్‌, హైడ్రో ఉత్పత్తితో పాటు ఎనర్జీ స్టోరేజీపై కూడా దృష్టి పెట్టాల్సిందే. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఇక ఇది తప్పనిసరి నిబంధనగా మారింది. ముసాయిదా విద్యుత్‌ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ రాష్ట్రాలు లక్ష్యాలను చేరుకోకపోతే విధించే పెనాల్టిdలను కూడా బిల్లులో పెట్టనున్నారు. ప్రస్తుత లక్ష్యాల ప్రకారం 2023-30 నాటికి పునరుత్పాదక విద్యుత్‌ను 24.61 నుంచి 43.33 శాతం వరకూ రాష్ట్రాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో విండ్‌ పవర్‌ 0.81 నుంచి 6.94 శాతంగా ఉంది. రెండేళ్ల క్రితమే నిర్దేశించిన హైడ్రో పవర్‌ 0.35 నుంచి 2.82 శాతం వరకూ వినియోగించాలి.

ఇక సౌరశక్తిదే అగ్రస్థానం. దీన్ని 23.44 నుంచి 33.57 శాతం తప్పక కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలి. మొట్టమొదటిసారిగా ఇంధన నిల్వపై కూడా నిబంధనలు వచ్చాయి. 1 నుంచి 4 శాతానికి పైగా శుద్ధ ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సోలార్‌, విండ్‌ మిల్లుల నుంచి తీసుకోవాలి. కేంద్రం నిర్దేశించిన ఈ అంచనాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు తమ లక్ష్యాలు, సాధ్యాసాధ్యాలను రూపొందించి కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా రాష్ట్రాలు పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసే స్థితిలో లేకపోతే మిగులు రాష్ట్రాల నుంచి లేదా విద్యుత్‌ అమ్మకం సంస్థల నుంచి తమ డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నట్టు సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ధరలను కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ ప్రతి ఏటా నిర్ణయిస్తుంది. ఇప్పటికే గత మూడేళ్లుగా ఈ లక్ష్యాలు వరుసగా, 17, 19, 21 శాతంగా ఉండగా, కేవలం అయిదు రాష్ట్రాలే సాధించాయి. గుజరాత్‌, కర్నాటక, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఇప్పటివరకూ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాయి.

2010 నుంచే పునరుత్పాదక ఇంధన కొనుగోలు యంత్రాంగం (ఆర్‌పీఓ)ను ప్రవేశపెట్టినా, పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న కొన్ని రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు దీనిపై అసలు దృష్టే పెట్టలేదు. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం అందుబాటులో ఉంది. దీంతో ఆయా రాష్ట్రాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రం నిబంధనలు పెడుతోంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టి చట్టం చేయనుంది. ఒకవేళ నిబంధనలు పాటించని రాష్ట్రాలకు జరిమానా విధించే విధంగా సవరణలు చేస్తోంది. యూనిట్‌కు 25 నుంచి 30 పైసల చొప్పున మొదటి ఏడాది, ఆ తర్వాతి సంవత్సరం నుంచ 35 నుంచి 50 పైసలు చొప్పున జరిమానా విధింపునకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌ 175 గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో సోలార్‌ ఎనర్జీ 100 గిగావాట్లు ఉండగా, 60 గిగావాట్లు గాలి మరల ద్వారా సాధించాలి. మిగిలిన ఇంధనం హైడ్రో పవర్‌ స్టేషన్లలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సమీకరిస్తుంది. ప్రస్తుతం భారత్‌ పునరుత్పాదక విద్యుత్‌ సామర్ధ్యం 114 గిగావాట్లు. ఇందులో సోలార్‌ 57, విండ్‌ 40 గిగావాట్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement